భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్కు షాక్!
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా.. లేదా అన్న దానిపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. నాడా రిపోర్టులను పరిగణనలోకి తీసుకోకుండా నర్సింగ్ ను ఈ నెల 18న ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి ఆ రెజ్లర్ ను ప్రశ్నించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) నిర్ణయించింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) జరిపిన డోపింగ్ టెస్టులో పాజిటీవ్ గా తేలినా అతడి తప్పులేదని భావించి అతడికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థలకు నాడా అందజేసింది.
ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, వాడా మాత్రం నర్సింగ్ను బరిలో దింపేందుకు అనుమతించడం లేదు. తాజాగా నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించాలనుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించింది. నాడా క్లీన్ చిట్ ను వాడా పట్టించుకోలేదు. దీంతో క్లీన్ చిట్ కోసం నర్సింగ్ మళ్లీ అప్పీలు చేయనున్నాడు. క్లీన్ చిట్ రాకపోవడంతో నర్సింగ్ రియోలో ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది.
వాడా అప్పీల్ విషయం మాకు సోమవారం తెలిసిందని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్పారు. దీనిపై అదేరోజు మా లాయర్ ద్వారా బదులిచ్చినట్లు తెలిపారు. 18న దీనిపై విచారణ కొనసాగుతుంది. కచ్చితంగా దీని నుంచి నర్సింగ్ బయటపడతాడని ఆయన ధీమాగా ఉన్నారు.