ఇప్పటికే రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతుండగా ఈసారి రష్యా డోపింగ్ నిరోధక ఏజెన్సీ (ఆర్‌యూఎస్‌ఏడీఏ)పై వేటు పడింది.
కొలరాడో స్ప్రింగ్స్: ఇప్పటికే రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతుండగా ఈసారి రష్యా డోపింగ్ నిరోధక ఏజెన్సీ (ఆర్‌యూఎస్‌ఏడీఏ)పై వేటు పడింది. నిబంధనలకు అనుగుణంగా ఈ ఏజెన్సీ పనిచేయకపోవడంతో సస్పెండ్ చేయాలని వాడా ఫౌండేషన్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. వాడా కోరిన ఆటగాళ్ల శాంపిల్స్‌ను నాశనం చేయడంలో ఆర్‌యూఎస్‌ఏడీఏ కీలక పాత్ర పోషించింది. ఈ వేటుతో రష్యాకు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. వాడా, ఐఓసీ నిబంధనలను అంగీకరించే దేశాలే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
‘డోపింగ్ ఏజెన్సీని పూర్తిగా మారుస్తాం’
మాస్కో: తమ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని రష్యా క్రీడా మంత్రి విటలీ ముట్కో తెలిపారు. ‘వాడా నుంచి ఇలాంటి నిర్ణయం వస్తుందని ఊహించాం. మా డోపింగ్ నిరోధక ఏజెన్సీ వ్యవస్థను పునర్‌నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో వాడాకు అన్నివిధాలా సహకరిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు.