
సెంచూరియన్: భారత క్రికెట్ జట్టులో అవకాశాలు కోసం ఎదురుచూడటం చాలా కష్టంగా ఉంటుందని మిడిల్ ఆర్డర్ ఆటగాడు మనీష్ పాండే స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో 48 బంతుల్లో 79 పరుగులు చేసిన మనీష్ పాండే..గతంలో ఇదే మైదానంలో టీ 20 శతకం సాధించాడు. దాంతో సెంచూరియన్ తనకు అచ్చొచ్చిన మైదానంగా మనీష్ పాండే పేర్కొన్నాడు. అయితే జట్టులో అవకాశాలు కోసం ఎదురుచూడటం చాలా కష్టంగా మారిందన్నాడు. కానీ అంతా మన ఆలోచనా దృక్పథంలోనే ఉంటుందని తెలిపాడు.
'అవకాశాల కోసం ఎదురుచూడడం నిజంగానే చాలా కష్టం. అదెప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటుంది. ప్రస్తుత పర్యటనలో ఇంకా ఎక్కువగా అనిపించింది. దిగ్గజాలు నిండిన టీమిండియాలో చోటు దక్కాలంటే ఎదురుచూడక తప్పదు. ఐదో స్థానంలో ప్రయత్నించా కానీ ఇంకా మెరుగు పడాల్సి ఉంది’ అని పాండే అన్నాడు. కాగా, గతంలో యువరాజ్, రైనా వంటి సీనియర్ ఆటగాళ్లు ఆడిన ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం, వారి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమని పాండే అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment