
రవిశాస్త్రిపై చర్యలు తీసుకోండి!
ముంబై: ఐదో వన్డేల సిరీస్ లో భాగంగా ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ పట్ల టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరింత జటిలంగా మారుతోంది. ఈ విషయాన్నిభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) దృష్టికి తీసుకువెళ్లాడు సుధీర్ నాయక్. తనను రవిశాస్త్రితోపాటు, కోచింగ్ స్టాఫ్ మెంబర్ అయిన భరత్ అరుణ్ లు అవమానించారంటూ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసిన సుధీర్ నాయక్.. వారిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. అసలు తన సహాయకుడిని దూషించడానికి భరత్ అరుణ్ కుమార్ ఎవరు అని సుధీర్ నాయక్ ప్రశ్నించాడు.
పిచ్ అంశాన్ని లేఖలో ప్రస్తావించిన సుధీర్ నాయక్ వివరణ ఇచ్చాడు. సాధారణంగా టీమ్ మేనేజ్ మెంట్ అడిగిన పిచ్ తయారు చేయడానికి కనీసం 10 నుంచి 12 రోజుల ముందుగానే తెలియజేస్తారన్నాడు. అయితే ముంబై వాంఖేడ్ పిచ్ విషయంలో మాత్రం ముందుగా తమకు ఎటువంటి పిచ్ కావాలన్నది తెలియచేయలేదన్నాడు. మ్యాచ్ ఆరంభానికి రెండు రోజుల ముందే టర్నింగ్ వికెట్ కావాలని టీమ్ మేనేజ్ మెంట్ కోరినట్లు సుధీర్ నాయక్ పేర్కొన్నాడు. దీంతో తమ శాయశక్తులా ప్రయత్నించి పిచ్ ను రూపొందించామన్నాడు. పిచ్ లో నీటిని తొలగించడమతో పాటు గడ్డిని కూడా రోలింగ్ చేసి పూర్తిగా చదును చేశామన్నాడు. తమకు ఏ పని అయితే అప్పచెప్పరో అది సమర్ధవంతంగా చేశామన్నాడు. కాగా, ముందు రోజు గుడ్ లెంగ్త్ ప్రాంతంలో నీటిని చల్లమని మేనేజ్ మెంట్ తెలిపినా.. రెండు వేర్వేరు పిచ్ లు తయారు చేయడం మంచిది కాదనే సలహాతోనే దాన్నిపక్కకు పెట్టామన్నాడు. దీనిపై బీసీసీఐ క్యూరేటర్ ధీరజ్ ప్రసన్న స్పష్టం చేసిన మార్గదర్శకాలను కూడా పాటించినట్లు సుధీర్ నాయక్ లేఖలో వివరించాడు. ఇటువంటి ఘటనలు బీసీసీఐ-అసోసియేషన్ ల మధ్య నెలకొన్న సానుకూల వాతావరణాన్ని పాడుచేస్తాయన్నాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిశాక గ్రేట్ వికెట్ అంటూ వ్యంగ్యంతో మొదలు పెట్టి అతను మరాఠీలో బూతు పురాణం లంకించుకోవడంతో అక్కడ ఉన్నవారందరూ విస్తుపోయారు. తాము కోరినట్లుగా స్పిన్ పిచ్ రూపొందించలేదంటూ వాంఖడే క్యురేటర్ సుధీర్ నాయక్ పై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన రవిశాస్త్రి-సుధీర్ నాయక్ ల అంశం ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో అనేది వేచి చూడాల్సిందే.