'ఆ క్రికెటర్ను తొలగించండి'
కరాచీ:ఇటీవల భారత్లో జరిగిన వరల్డ్ టీ 20 కప్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ చీఫ్ కోచ్ వకార్ యూనిస్ తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. వరల్డ్ టీ 20 అనంతరం పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన వకార్.. తనకు అవకాశం దొరికినా ఆటగాళ్లపై మండిపడుతున్నాడు. మరోసారి పాకిస్తాన్ క్రికెటర్లు షాహిద్ ఆఫ్రిది, ఉమర్ అక్మల్లను టార్గెట్ చేస్తూ వకార్ విమర్శనాస్త్రాలు సంధించాడు.
ఒక ఆటగాడిగా, కెప్టెన్గా ఆఫ్రిది పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే పాకిస్తాన్ జట్టు వరుసగా ఓటములు చవిచూసిందన్నాడు. వరల్డ్ టీ 20నే కాదు.. అంతకుముందు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆసియా కప్లలో కూడా పాకిస్తాన్ పేలవ ప్రదర్శనకు ఆఫ్రిదినే ప్రధాన కారణమన్నాడు. మరో పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ ను జట్టు నుంచి తొలగించాలని వకార్ డిమాండ్ చేశాడు. గతంలో శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా ఫిట్ నెస్ నిరూపించుకోవడానికి హాజరు కావాల్సిందిగా అక్మల్ ను మాజీ చీఫ్ సెలక్టర్ హారూన్ రషీద్ కోరినా అతను ఆ మాటను పెడచెవిన పెట్టి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్నాడు.
ఆ సమయంలో పీసీబీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కరీబియన్ లీగ్ లో ఆడటానికి అక్మల్ వెళ్లిపోయి తమను అవమానపరిచిన సంగతిని అక్రమ్ ప్రస్తావించాడు. అటువంటి ఆటగాడ్ని జట్టులో ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించకూడదంటూ ధ్వజమెత్తాడు. ఇలా తమ ప్రవర్తన కారణంగా ఎంతో టాలెంట్ ఉండికూడా ఆండ్రూ సైమండ్స్, కెవిన్ పీటర్సన్లు జట్టులో స్థానం కోల్పోయిన సంగతిని అక్రమ్ గుర్తు చేశాడు.