మేమేమీ అజేయులం కాదు!
లంకతో ఓటమిపై కోహ్లి వ్యాఖ్య
లండన్: ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు శ్రీలంక షాక్ ఇచ్చింది. అయితే 8 పటిష్ట జట్లు తలపడుతున్న టోర్నీలో ఇలాంటి ఓటమి సహజమేనని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయ పడ్డాడు. ‘మేం చేసిన స్కోరు విజయానికి సరిపోతుందని అనిపించింది. నిజానికి మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ చాలా బాగా ఆడారనే విషయం మరచిపోవద్దు. వారి ప్రదర్శనను కూడా గుర్తించాలి కదా. అయినా మేమేమీ అజేయులం కాదు.
మాకూ పరాజయాలు ఎదురు కావచ్చు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. తగిన వ్యూహంతో లంక ఆడిన తీరును అభినందిస్తూ ఓటమిని అంగీకరించడం తప్ప మరేమీ చేయలేమని కోహ్లి అన్నాడు. భారత బౌలర్ల ప్రదర్శనను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అదనంగా మరో 20 పరుగులైనా చేయాల్సి ఉంటుందని విరాట్ విశ్లేషించాడు. మధ్య ఓవర్లలో కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేయడం భారత్‌కు మొదటినుంచి అలవాటు లేదని ఈ సందర్భంగా కోహ్లి గుర్తు చేశాడు.‘50 ఓవర్ల పాటు దూకుడుగా ఆడే జట్టు కాదు మాది. ఆరంభంలో నెమ్మదిగా ఆడి నిలదొక్కుకున్న తర్వాత చివర్లో చెలరేగిపోవడమే మా శైలి’ అని కెప్టెన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
వరద బాధితులకు అంకితం...
మరోవైపు లంక కెప్టెన్ మాథ్యూస్ ‘మా దేశంలో ఇటీవల చోటు చేసుకున్న విషాదం మాటల్లో చెప్పరానిది. వరదల్లో అనేక మంది చనిపోవడంతో దేశం అంతటా ఒక రకమైన బాధాకర వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి స్థితిలో క్రికెట్‌లో మా గెలుపు వారి మొహాల్లో చిరునవ్వులు పూయిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు.