మేం సిద్ధంగా ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నా... 14వ తేదీన వర్షం లేకపోతే భారత్, వెస్టిండీస్‌ల మధ్య మూడో వన్డేను సాఫీగా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ధీమా వ్యక్తం చేసింది. ‘బీసీసీఐ క్యూరేటర్ విశ్వనాథ్ నేతృత్వంలో మంచి పిచ్‌ను తయారు చేశాం. ప్రస్తుతం మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పిఉంచాం. మా దగ్గర మొత్తం నాలుగు సూపర్ సాపర్స్ ఉన్నాయి. వీటితో ఎంత పెద్ద వర్షం వచ్చినా రెండు గంటల్లో మైదానాన్ని సిద్ధం చేయొచ్చు.
12వ తేదీన తుపాన్ తీరం దాటుతుందని అంటున్నారు. కాబట్టి 14కి వర్షం ఉండకపోవచ్చని భావిస్తున్నాం. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ అసలు జరగకపోతే టిక్కెట్లు కొనుక్కున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’ అని ఏసీఏ తెలిపింది.
అయితే ఒకవేళ భారీ వర్షం వస్తే మ్యాచ్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం ఉండదని, ఇప్పటికిప్పుడు వన్డే వేదికను మార్చే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ‘ఆటగాళ్లను వేరే వేదికకు పంపి మ్యాచ్‌ను ఆడించడం సులభమే. కానీ టీవీ ప్రసారదారులకు ఇది సులభం కాదు’ అని బీసీసీఐ కార్యదర్శి పటేల్ చెప్పారు.
ఎప్పుడు వస్తారో..?: షెడ్యూల్ ప్రకారం భారత్, విండీస్ క్రికెటర్లు ఆది వారం రోజు విశాఖకు చేరుకోవాలి. కానీ తుపాన్ కారణంగా ఆదివారం విశాఖకు రావలసిన విమానాలను రద్దు చేసే అవకాశం ఉంది. పరిస్థితి బాగోలేదు కాబట్టి... చార్టర్డ్ ఫ్లయిట్‌లోనూ క్రికెటర్లను పంపే అవకాశాలు తక్కువే. సోమవారం పరిస్థితి మెరుగుపడితే క్రికెటర్లు నగరానికి చేరుకుంటారు.