
సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం: బీసీసీఐ
న్యూఢిల్లీ: జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదించిన సిఫారుసుల అమలుపై తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాము గౌరవపూర్వకంగా స్వీకరిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్ కోశాధికారి , ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే లోథా కమిటీ ప్రతిపాదనలను ఏ రకంగా అమలు చేయాలనే దానిపై ప్రధాన దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. 'సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం. లోథా కమిటీ కొన్ని ప్రతిపాదనలు సూచించింది. ఆ ప్రతిపాదనల్లో చాలా వాటిని సుప్రీం ఆమోదించింది. వాటిని అమలు చేయడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళతాం. అయితే ఎలా అమలు చేయాలి అనే దానిపై త్వరలో కార్యచరణ రూపొందిస్తాం' అని శుక్లా పేర్కొన్నారు.
బీసీసీఐ ప్రక్షాళనలో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఏర్పాటైన జస్టిస్ లోథా కమిటీ అనేక ప్రతిపాదనలను సూచించింది. అయితే దీనిపై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసిన బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిలో భాగంగా సోమవారం మరోసారి బీసీసీఐ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం.. దాదాపులోథా కమిటీ సూచించిన అన్ని ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆరు నెలల్లో క్రికెట్ను ప్రక్షాళన చేయాలని బీసీసీఐకు సూచించిన సుప్రీం.. క్రికెట్ కు రాజకీయ నేతలకు దూరంగా ఉండాలని తీర్పులో స్పష్టం చేసింది.