
'ఆ సమయంలో అతడే బెస్ట్'
టీమిండియా కెప్టెన్ 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిపై సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు.
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిపై సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొవడంలో ధోని బెస్ట్ కెప్టెన్ అని కితాబిచ్చాడు. తన టెస్టు కెరీర్ స్వల్పకాలంలోనే ముగియపడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో పునరాగమనం చేసిన 37 ఏళ్ల నెహ్రా సత్తా చాటాడు. 'ఏబీపీ న్యూస్' ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ధోని గురించి అడిగిన ప్రశ్నలకు నెహ్రా సమాధానం ఇచ్చాడు.
'మహ్మద్ అజాహరుద్దీన్ కెప్టెన్సీలో 1999లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టా. అప్పటి నుంచి ఎంతో మంది కెప్టెన్ల నాయకత్వంలో ఆడాను. ఒత్తిడి సమయంలో ధోని సమర్థవంతంగా వ్యవహరిస్తాడు. ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొవడంలో ధోని బెస్ట్. అత్యంత కిష్టపరిస్థితుల్లోనూ కూల్ గా ఉండడం ధోనికే సాధ్యమ'ని నెహ్రా ప్రశంసించాడు.
17 టెస్టులకు మించి ఆడకపోవడం తన తప్పిదమేనని ఒప్పుకున్నాడు. 2009లో టెస్టుల్లో పునరాగమనం చేస్తావా అని ధోని, కోచ్ గ్యారీ కిర్ స్టన్ అడిగినప్పడు తాను సరిగా స్పందించలేదన్నాడు. మీడియాలో తన గురించి ఏం రాసినా పట్టించుకోనని నెహ్రా తెలిపాడు. తాను మీడియాకు దూరంగా ఉంటానని చెప్పాడు.