ధోనీ ఎందుకంత కసిగా కొట్టాడు?
సాధారణంగా భారత్ - పాక్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్‌తో సహా ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆటగాళ్లు కూడా క్రికెట్ ఆడుతున్నట్లు కాక యుద్ధం చేస్తున్నట్లు ఉంటారు. కానీ, ఆదివారం మిర్పూర్‌లో బంగ్లాదేశ్- భారత్ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం అంతకంటే ఎక్కువగానే అనిపించింది. సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడో స్థానంలో వచ్చే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ నాలుగో నెంబరులో వచ్చాడు. వస్తూ వస్తూనే బంగ్లా బేబీల మీద విరుచుకుపడ్డాడు. కేవలం ఆరు బంతుల్లో 20 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు. అందులో రెండు భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. ధోనీ ఎందుకంత కసిగా కొట్టాడు... ఎందుకు ముందు వరుసలోకి ప్రమోట్ చేసుకుని వచ్చాడు?
ఈ ప్రశ్నలకు టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి సమాధానం చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే ప్రజంటేషన్ సెర్మనీలో హర్షా భోగ్లే అడిగినప్పుడు రవిశాస్త్రి చెప్పిన విషయం చాలామంది టీమిండియా ఫ్యాన్స్ గుండెలను హత్తుకుంది. ''ఫైనల్ మ్యాచ్ ఎంజాయ్ చెయ్యమని మా వాళ్లకు చెప్పాను. అయితే, గతంలో బంగ్లాదేశ్ జట్టు సిరీస్ గెలిచినప్పుడు వాళ్లు చేసుకున్న సంబరాలను మాత్రం గుర్తుంచుకోవాలని తెలిపాను. ఇప్పుడు వెళ్లి, చితక్కొట్టాలని సూచించాను'' అన్నాడు. ఆ కసి మొత్తం ధోనీ బ్యాటింగ్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది. అంతేకాదు.. బంగ్లాదేశ్ వీరాభిమాని ఒకరు అత్యుత్సాహంతో బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్... టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల పట్టుకుని వెళ్తున్నట్లు ఓ మార్ఫింగ్ ఫొటోను రూపొందించి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అప్పటికే ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
విజయానికి 121 పరుగులు చేయాల్సిన టీమిండియా.. చివర్లో 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటివరకు వీరవిహారం చేసిన శిఖర్ ధవన్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో విరాట్ కోహ్లీ.. అప్పటికే కుదురుకున్నా, భారీషాట్లు మాత్రం రావడం లేదు. అప్పటికే యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా ముగ్గురూ ప్యాడ్లు కట్టుకుని, బ్యాట్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. బంగ్లా అభిమానులు గోళ్లు కొరుక్కుంటూ కొందరు, దేవుడికి ప్రార్థనలు చేస్తూ మరికొందరు కనిపించారు. ఇంతలో కెమెరాలు క్రీజ్ వైపు తిరిగాయి. అక్కడ బ్యాటింగ్ ఎండ్‌లో చూస్తే.. ధోనీ!! అంతా ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ఏడో స్థానంలో వచ్చే ధోనీ.. ఏకంగా నాలుగో స్థానానికి రావడం ఏంటనుకున్నారు. ఎందుకు వచ్చాడో పది నిమిషాల తర్వాత తెలిసింది. అప్పటికే విధ్వంసం జరిగిపోతోంది. 14వ ఓవర్ తొలిబంతిని 105 మీటర్ల దూరానికి సిక్సర్ కొట్టాడు. ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడక్కడ పల్చగా ఉన్న భారత అభిమానులు మాత్రం జెండాలు ఎగరేస్తూ గెంతుతున్నారు. అదే ఓవర్‌లో మరో ఫోర్, ఇంకో సిక్సర్.. అంతే, ఆసియా కప్ భారత్‌కు వచ్చేసింది. దీంతో.. చిన్నపిల్లలు నిప్పుతో ఆటలు ఆడుకోకూడదని, అలా ఆడుకుంటే చేతులు కాలక తప్పదని భారత అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు.