లండన్: ఫిట్‌నెస్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించి ఆందోళనపరిచే విషయమిది. భారత్-ఇంగ్లండ్ రెండో టెస్టులో భాగంగా లార్డ్స్ టెస్టు రెండో రోజే వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతూ అతను ఫీల్డింగ్‌లో పూర్తి సమయం మైదానంలో ఉండలేకపోయాడు. ఆదివారం కూడా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం 37 నిమిషాల పాటు కోహ్లి ఫీల్డ్‌కు రాలేదు. దాంతో నిబంధనల ప్రకారం అతను కాస్త ఆలస్యంగా క్రీజ్‌లోకి రావాల్సి వచ్చింది. అందుకే రహానేను ముందు పంపి బ్యాటింగ్ ఆర్డర్‌లో విరాట్ ఐదో స్థానంలో వచ్చాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కూడా సాధారణంగా అతనిలో కనిపించే చురుకుదనం, పట్టుదల ఎక్కడా కనపడలేదు. గ్రౌండ్‌లో గడిపిన కొద్ది సమయంలోనే వెన్ను నొప్పికి చికిత్స చేయించుకొని అతను ట్యాబ్లెట్‌లు వేసుకున్నాడు.
కరన్ బౌలింగ్‌లో ఇబ్బందిగా సింగిల్ తీసి, తర్వాతి బంతికే రెండో పరుగును అతి కష్టమ్మీద కుంటుతూ పూర్తి చేసినప్పుడే సమస్య తీవ్రంగా ఉందని అర్థమైంది. చివరకు అన్‌ఫిట్ విరాట్ కోహ్లి ఔట్‌తోనే భారత్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. ముందుగా బ్రాడ్ ఓవర్లో బంతి బ్యాట్‌కు తగిన కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు భావించి ఇంగ్లండ్ రివ్యూ చేసినా ఫలితం విరాట్‌కు అనుకూలంగా వచ్చింది. అయితే తర్వాతి బంతికే షార్ట్‌లెగ్‌లో ఫీల్డర్ అందుకున్న క్యాచ్‌ను అంపైర్ దార్ ఔట్‌గా ప్రకటించాడు. వెంటనే కోహ్లి రివ్యూ చేసినా... బంతి అతని గ్లవ్‌కు తాకి వెళ్లినట్లు స్పష్టం కావడంతో వెనుదిరగక తప్పలేదు.
ఇక తర్వాతి టెస్టుకు (18 నుంచి) చాలా విరామం ఉంది కాబట్టి అతను తొందరగా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ను అందుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. మరో వైపు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అశ్విన్ చేతి వేళ్లకు కూడా రెండు సార్లు గాయమైంది. బ్రాడ్, వోక్స్ బౌలింగ్‌లలో దెబ్బలు తగలడంతో నొప్పిని తట్టుకోలేక అశ్విన్ చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment