ఈ సారి గెలుస్తాం
ప్రొ కబడ్డీ టైటిల్‌పై టైటాన్స్ ధీమా
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో తమ జట్టు విజేతగా నిలుస్తుందని తెలుగు టైటాన్స్ యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి మూడు సీజన్లలో కేవలం అటాకింగ్‌పై దృష్టి పెట్టామని, ఈసారి బలమైన డిఫెన్స్‌ను తయారు చేసుకున్నామని ఆయన చెప్పారు. సీజన్ తొలి మ్యాచ్‌లో శనివారం పుణేరీ పల్టన్‌తో టైటాన్స్ తలపడుతుంది. గత కొద్ది రోజులుగా నగరంలో జట్టుకు శిక్షణా శిబిరం నిర్వహించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో టీమ్‌లోని కొత్త ఆటగాళ్లను ఫ్రాంచైజీ పరిచయం చేసింది. కెప్టెన్ రాహుల్ చౌదరి, సుకేశ్ హెగ్డేలను కొనసాగించిన ఈ జట్టు మిగతా ఆటగాళ్లను వేలంలో తీసుకుంది.
కోచ్ ఉదయ్‌కుమార్, రాహుల్‌తో కలిసి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. ‘గత ఏడాది అత్యుత్తమ డిఫెండర్‌గా నిలిచిన సందీప్ నర్వాల్‌ను మేం జట్టులోకి తీసుకున్నాం. జట్టు సభ్యులైన పాకిస్తాన్, ఇరాన్ ఆటగాళ్లు నేరుగా మ్యాచ్ బరిలోకి దిగుతారు. జట్టు తొలి లక్ష్యం సెమీ ఫైనల్‌కు చేరడం. సొంతగడ్డపై మాకు మంచి రికార్డు ఉంది కాబట్టి హైదరాబాద్‌లో జరిగే సెమీస్, ఫైనల్‌లలో కూడా విజయం సాధిస్తాం’ అని శ్రీనివాస్ చెప్పారు. హైదరాబాద్‌లో టైటాన్స్ మ్యాచ్‌లు జులై 3నుంచి 6 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతాయి. సెమీస్ 29న, ఫైనల్స్ 31న జరుగుతాయి.