‘బౌండరీ’పై ఆసీస్ గురి
నాలుగో టైటిల్ కోసం కంగారూలు
తొలి టైటిల్ లక్ష్యంగా వెస్టిండీస్
మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్ నేడు
కోల్‌కతా నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు మరో ప్రపంచకప్‌పై కన్నేసింది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో తలపడుతుంది. మహిళల క్రికెట్‌లో ఇప్పటి వరకు నాలుగు ప్రపంచకప్‌లు జరగ్గా తొలి సారి (ఇంగ్లండ్) మినహా మిగిలిన మూడు సార్లు నెగ్గిన ఆస్ట్రేలియా ఎదురులేని జట్టుగా ఉంది. మరో వైపు విండీస్ తొలిసారి ఫైనల్ ఆడబోతోంది. టోర్నీలో ఇప్పటి వరకు బ్యాటింగ్‌లో ఆసీస్ ఆధిక్యం ప్రదర్శించగా... విండీస్ బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది.
సమ ఉజ్జీల సమరం: లీగ్ దశలో ఆస్ట్రేలియా, వెస్టిం డీస్ సమానంగా చెరో 3 విజయాలు సాధించాయి. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఆసీస్... న్యూజిలాండ్‌ను విండీస్ ఓడించాయి. అత్యధిక పరుగులు చేసిన టాప్-10 బ్యాట్స్‌విమెన్ జాబితాలో ఆసీస్‌నుంచి లానింగ్ (149), విలాని (119) ఉండగా... విండీస్ జట్టు తరఫున స్టెఫానీ టేలర్ (187), డాటిన్ (111) ఉన్నారు. విండీస్ బౌలర్లలో టేలర్ 8, ఫ్లెచర్ 7 వికెట్లతో రాణించగా... షుట్ (ఆసీస్) 7 వికెట్లు తీసింది. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లకు విండీస్‌తో పోలిస్తే ఎక్కువగా అంతర్జాతీయ అనుభవం ఉండటంఅనుకూలాంశం.