బోల్ట్... తడబడి ఫైనల్‌కు
100 మీటర్ల సెమీస్‌లో జమైకా స్టార్‌కు రెండో స్థానం
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
లండన్: తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించాలనే లక్ష్యంతో లండన్‌కు వచ్చిన ఉసేన్ బోల్ట్ ఆ దిశగా ఆఖరి అడుగు వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 100 మీటర్ల విభాగంలో ఈ జమైకా చిరుత ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం రాత్రి జరిగిన మూడో సెమీఫైనల్లో బోల్ట్ 9.98 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు.
ఈ రేసులో బోల్ట్‌ను వెనక్కి నెట్టి క్రిస్టియన్ కోల్‌మన్ (అమెరికా–9.97 సెకన్లు) అగ్రస్థానాన్ని సంపాదించడం విశేషం. తొలి సెమీఫైనల్ ద్వారా అకాని సింబిని (దక్షిణాఫ్రికా–10.05 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (అమెరికా–10.09 సెకన్లు)... రెండో సెమీఫైనల్ ద్వారా యోహాన్ బ్లేక్ (జమైకా–10.04 సెకన్లు), రెసి ప్రెస్కోడ్ (బ్రిటన్–10.05 సెకన్లు) ఫైనల్‌కు అర్హత పొందారు. ఈ ఆరుగురు కాకుండా అత్యుత్తమ సమయాలను నమోదు చేసిన మరో ఇద్దరు జిమ్మీ వికాట్ (ఫ్రాన్స్–10.09 సెకన్లు), బింగ్తియాన్ సు (చైనా– 10.10 సెకన్లు) కూడా ఫైనల్ బెర్త్‌లు పొందారు.
హీట్స్‌లోనే ద్యుతీ చంద్, అనస్ అవుట్
మరోవైపు ఈ మెగా ఈవెంట్‌లో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్... పురుషుల 400 మీటర్ల విభాగంలో అనస్ హీట్స్‌లోనే వెనుదిరిగారు.
ఔరా... ఫరా!
సొంతగడ్డపై బ్రిటిష్ అథ్లెటిక్స్ దిగ్గజం మొహమ్మద్ ఫరా మరోసారి మెరిశాడు. పురుషుల 10 వేల మీటర్ల ఫైనల్ రేసులో 34 ఏళ్ల ఫరా 26 నిమిషాల 49.51 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో 10 వేల మీటర్ల విభాగంలో ఫరాకిది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. కిప్‌రుయ్ చెప్‌టెగి (ఉగాండా; 26ని:49.94 సెకన్లు) రజతం, పాల్ తనుయ్ (కెన్యా; 26ని:50.60 సెకన్లు) కాంస్యం సాధించారు.