లాస్ట్ రేస్: కుప్పకూలిన ఉసేన్ బోల్ట్
లండన్: తన అంతర్జాతీయ కెరీర్‌ను పసిడి పతకంతో ముగించాలని ఆశించిన జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ తన అభిమానులను నిరాశపరిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇటీవల జరిగిన 100 మీటర్ల రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సంతృప్తి చెందిన బోల్ట్.. శనివారం రాత్రి జరిగిన 4X100 మీటర్ల రిలే ఫైనల్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. బోల్ట్ బ్యాటన్ అందుకునే సరికే అతడు నేతృత్వం వహిస్తోన్న జమైకా జట్టు మూడోస్థానంలో ఉంది.
కొద్ది దూరం పరుగెత్తిన వెంటనే తొడ కండరాలు పట్టేయడం, మోకాలినొప్పితో ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు బోల్ట్. దీంతో స్వర్ణంతో కాదు కదా పతకం లేకుండానే అంతర్జాతీయ కెరీర్‌ను బోల్ట్ ముగించినట్లయింది. 4X100 మీటర్ల రిలేలో వరుసగా ఐదో పతకాన్ని అందించేందుకు బోల్ట్ విశ్వ ప్రయత్నాలు చేసినా చివరి మెట్టుపై గాయం కారణంగా సాధించలేకపోయాడు. టికెండో ట్రేసీ, జూలియన్ ఫోర్టీ, మైకేల్ క్యాంప్‌బెల్, ఉసేన్ బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం పతకాన్ని చేజార్చుకుంది.
ట్రాక్‌పై కుప్పకూలి, బాధతో విలవిల్లాడుతున్న ఉసేన్ బోల్ట్
బ్రిటన్‌కు స్వర్ణం
చిజిండు ఉజా, ఆడం గెమిలి, డానీ టాల్బాట్, నెథానీల్ మిచెల్ బ్లేక్ తో కూడిన బ్రిటన్ బృందం 37.47 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. జస్టిస్ గాట్లిన్ నేతృత్వంలోని అమెరికా అథ్లెట్లు 37.52 సెకన్లలో రేసు పూర్తి చేసి రజతం సాధించగా, జపాన్ బృందం 38.04 సెకన్లలో రేసు పూర్తి చేసి కాంస్యం సొంతం చేసుకుంది.