నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): భారత రెజ్లింగ్ చరిత్రలో ఒకే ఒక్కడు సుశీల్ కుమార్ మాత్రమే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. 2010లో అతను ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి నుంచి మరో స్వర్ణం మన ఖాతాలో చేరలేదు. ఇప్పుడు స్వర్ణం గెలుచుకునే లక్ష్యంతో వరల్డ్ నంబర్‌వన్ బజరంగ్ పూనియా (65 కేజీలు) శనివారం మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నీ అయిన ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 108 ఒలింపిక్ బెర్త్‌లు ఖరారవుతాయి.
పురుషుల ఫ్రీస్టయిల్ (57, 65, 74, 86, 97, 125 కేజీలు), గ్రీకో రోమన్ (60, 67, 77, 87, 97, 130 కేజీలు), మహిళల ఫ్రీస్టయిల్ (50, 53, 57, 62, 68, 76 కేజీలు) విభాగాల్లో టాప్–6లో నిలిచిన వారు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. గత ఏడాది బుడాపెస్ట్‌లో జరిగిన ఇదే పోటీల్లో రజతం సాధించిన బజరంగ్ తన ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ 74 కేజీల విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జూనియర్ వరల్డ్ చాంపియన్ దీపక్ పూనియా (86 కేజీలు) ఇక్కడ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం. బజరంగ్ 19న, సుశీల్ 20న, దీపక్ 21న బరిలోకి దిగుతారు.
Comments
Please login to add a commentAdd a comment