టి కప్లో భారత్, ఆసీస్ రికార్డు ఇదీ..
మొహాలీ: మొహాలీ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా ఇరు జట్లకు ఎంతో కీలకం. టి-20 ప్రపంచ కప్ సెమీస్ బెర్తు దక్కాలంటే భారత్ ఈ మ్యాచ్ గెలిచితీరాలి. ఆసీస్ది ఇదే పరిస్థితి. ఇరు జట్లు చెరో రెండు విజయాలతో నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ఆదివారం జరిగే ఈ మ్యచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టి-20 ఫార్మాట్లో టీమిండియాకు ఆసీస్పై ఘనమైన రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 12 టి-20 మ్యాచ్లు ఆడగా.. భారత్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఆసీస్ కేవలం నాలుగింటిలో నెగ్గింది. కాగా టి-20 ప్రపంచ కప్లో ఇరు జట్ల రికార్డు 2-2తో సమంగా ఉంది. ఈ ఈవెంట్ లో భారత్, ఆసీస్ ఎప్పుడెప్పుడు తలపడ్డాయంటే..
2007 ప్రపంచ కప్: ఆరంభ టి-20 ప్రపంచ కప్ సెమీస్లో భారత్, ఆసీస్ తలపడ్డాయి. డర్బన్లో జరిగిన ఈ మ్యాచ్లో ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యువరాజ్ సింగ్ (30 బంతుల్లో 70), ధోనీ (18 బంతుల్లో 36) రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. లక్ష్యసాధనలో ఆసీస్ను భారత బౌలర్లు 173 పరుగులకు కట్టడి చేశారు. దీంతో టీమిండియా 15 పరుగులతో విజయం సాధించింది.
2010 ప్రపంచ కప్: బ్రిడ్జిటౌన్లో జరిగిన మ్యాచ్లో ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కంగారూలు 184/5 స్కోరు చేయగా, లక్ష్యసాధనలో ధోనీసేన 135 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో రోహిత్ శర్మ (46 బంతుల్లో 79) మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 49 పరుగులతో భారీ విజయం సాధించింది.
2012 ప్రపంచ కప్: ఈ ఈవెంట్లోనూ ధోనీసేనకు కంగారూల చేతిలో ఓటమి ఎదురైంది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లోనూ టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ పూర్తి ఓవర్లలో 140/7 స్కోరు చేసింది. లక్ష్యసాధనలో ఒకే వికెట్ కోల్పోయిన ఆసీస్ ఘనవిజయం సాధించింది.
2014 ప్రపంచ కప్: గత ప్రపంచ కప్లో ధోనీసేన.. ఆసీస్పై ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. యువరాజ్ (40 బంతుల్లో 60), ధోనీ (24) సాయంతో 159/7 స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు అశ్విన్ (4/11), అమిత్ మిశ్రా (2/13) రాణించి ఆసీస్ ను కుప్పకూల్చారు. దీంతో భారత్ 73 పరుగులతో భారీ విజయం సాధించింది.