రెజ్లింగ్‌లో వివాదం... | Wrestling Bronze Match controversy | Mongolia vs Uzbekistan | Olympics 2016 | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్‌లో వివాదం...

Published Mon, Aug 22 2016 2:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

రెజ్లింగ్‌లో వివాదం...

రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల చివరి రోజు డ్రామా జరిగింది. ఇఖ్తియోర్ నవ్రుజోవ్ (ఉజ్బెకిస్తాన్), మండక్‌నరన్ గన్‌జోరిగ్ (మంగోలియా) మధ్య పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో ఈ వివాదం చోటు చేసుకుంది. నిర్ణీత సమయం పూర్తికావడానికి మూడు సెకన్లు ఉందనగా 7-6తో ఆధిక్యంలో ఉన్న గన్‌జోరింగ్ తన విజయం ఖాయమైందనుకొని విజయ సంబరాలు చేసుకున్నాడు. అయితే ఉజ్బెకిస్తాన్ రెజ్లింగ్ కోచ్ రివ్యూ కోరడం... వారు నవ్రుజోవ్‌కు రెండు పాయింట్లు ప్రదానం చేసి అతను 8-7తో గెలిచినట్లు ప్రకటించడంతో మంగోలియా రెజ్లర్ గన్‌జోరిగ్, అతని కోచ్‌లు ఆశ్చర్యపోయారు.

తమకు అన్యాయం జరిగిందని మ్యాట్‌పైనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగోలియాకు చెందిన ఇద్దరు కోచ్‌లు తమ ట్రాక్ సూట్‌ను, బూట్లు విప్పేసి మ్యాట్‌పై విసిరేశారు. బౌట్‌ను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రిఫరీ వారిద్దరికీ రెడ్ కార్డు చూపెట్టారు. నవ్రుజోవ్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు ఫ్రాంక్లిన్ గోమెజ్ (పోర్టోరికో), నవ్రుజోవ్‌ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్ కూడా వివాదాస్పదమైంది. నవ్రుజోవ్‌కు అనుకూల ఫలితం వచ్చేలా రిఫరీలు తెమో కజారష్‌విలి (జార్జియా), టాంగ్ కున్ చుంగ్ (కొరియా), నొవకోస్కీ (రష్యా) వ్యవహరించారని అనుమానిస్తూ రిఫరీ కమిషన్ చైర్మన్ అంటోనియా సిల్వెస్ట్రి (జర్మనీ) ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement