ఒలింపిక్స్‌కు యోగేశ్వర్ అర్హత
ఆసియా క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణం
ఆస్తానా (కజకిస్తాన్): అంచనాలకు అనుగుణంగా రాణించిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ భారత్‌కు రియో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో యోగేశ్వర్ దత్ పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో యోగేశ్వర్‌తో తలపడాల్సిన అతని ప్రత్యర్థి కతాయ్ యెర్లాన్‌బీకీ (చైనా) బరిలోకి దిగకపోవడంతో భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు.
ఈ టోర్నీలో ఆయా విభాగాలలో ఫైనల్‌కు చేరిన రెజ్లర్లకు మాత్రమే ఒలింపిక్ బెర్త్ ఖాయమవుతుంది. యోగేశ్వర్ ఫలితంతో ఇప్పటివరకు రెజ్లింగ్‌లో భారత్‌కు రెండు బెర్త్‌లు ఖాయమయ్యాయి. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) కాంస్యం సాధించి భారత్‌కు తొలి బెర్త్‌ను అందించాడు.