
సాక్షి, హైదరాబాద్: క్రీడాకారులు ఫలితం గురించి ఆలోచించకుండా బరిలో దిగినప్పుడు మాత్రమే పూర్తిస్థాయి ప్రతిభ కనబరచగలుగుతారని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ అన్నారు. ఆయన సెయింట్ మేరీస్ గ్రూప్‌నకు చెందిన స్కోలా మారియా ఇంటర్నేషనల్ స్కూల్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో, యువ క్రీడాకారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న క్రీడను ప్రేమించాలని అన్నారు.
గట్టిగా కృషిచేస్తూ ఆటను ఆస్వాదిస్తేనే సుదీర్ఘ కాలం మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. 40 ఏళ్ల పాటు క్రికెటే తన జీవితంగా మారిపోయిందంటూ వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన కిర్‌స్టన్ గుర్తు చేసుకున్నారు. క్రీడాకారులకు గెలుపు మాత్రమే ప్రయాణం కాకూడద న్న ఆయన విద్యార్థి సమగ్రాభివృద్ధి సాధించే లా ఉపాధ్యాయులు సహకరించాలని వ్యాఖ్యా నించారు. ఏ విషయంలోనూ తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయవద్దని సూచించారు.