
యూనస్ ఖాన్ అరుదైన ఘనత
అబు దాబి: పాకిస్థాన్ క్రికెటర్ యూనస్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు(8,852) నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ పేరిట ఉన్న టెస్టు పరుగుల (8,832)ను యూనస్ అధిగమించాడు.
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మంగళవారం యూఏఈలో ఇంగ్లండ్ తో ప్రారంభమైన తొలి టెస్టులో యూనస్ తన వ్యక్తిగత స్కోరు 37 పరుగుల వద్ద ఈ ఘనతను సాధించాడు. 102 టెస్టు మ్యాచ్ ఆడుతున్న యూనస్.. ఇంగ్లిష్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ లో సిక్స్ కొట్టి మియందాద్ రికార్డును అధిగమించాడు. ఏకకాలంలో మరో పాకిస్థాన్ కెప్టెన్ ఇంజామమ్ వుల్ హక్(8,830) పరుగుల రికార్డును కూడా యూనస్ తిరగరాశాడు. అయితే అత్యధిక పరుగుల ఫీట్ కు మరో పరుగును జోడించిన అనంతరం స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యూనస్ పెవిలియన్ కు చేరాడు. కాగా, అత్యధిక టెస్టు మ్యాచ్ పరుగుల రికార్డు భారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 200 టెస్టు మ్యాచ్ ల్లో 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.