యూకీ బాంబ్రి ఓటమి
సెమీస్‌లో బోపన్న జోడి
చెన్నై ఓపెన్
చెన్నై: భారత యువ టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. చెన్నై ఓపెన్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్‌లో తను 3–6, 4–6 తేడాతో వరుస సెట్లలో ఫ్రాన్స్‌కు చెందిన బెనాయిట్ పైర్ చేతిలో ఓడాడు. దీంతో ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లంతా ఓటమి చెందినట్టయ్యింది. గంటన్నరపాటు సాగిన ఈ పోరులో పైర్ ఏకంగా 12 ఏస్‌లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, నెడుంచెళియన్ జంట అతికష్టంగా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో సెరెటాని (అమెరికా), ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) జోడి పై 6–2, 3–6, 12–10 తేడాతో నెగ్గింది.
నేను రిటైర్ కావట్లేదు! స్పష్టం చేసిన లియాండర్ పేస్
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తాను ఆటనుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు. తన మాటలను అపార్థం చేసుకున్నారని అతను వివరణ ఇచ్చాడు. నిజానికి తాను వచ్చే ఏడాది మరో చెన్నై ఓపెన్ గెలవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొత్త భాగస్వామి ఆండ్రీ సా బెగాన్ (బ్రెజిల్)తో కలిసి ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ గెలవాలన్నదే తన ముందున్న లక్ష్యమన్నాడు.