పఠాన్ బ్రదర్స్ క్రికెట్ అకాడమీ
వచ్చే నెల చివర్లో బరోడాలో అందుబాటులోకి...
ముంబై: భారత క్రికెటర్లు యూసుఫ్, ఇర్ఫాన్ పఠాన్‌లు బరోడాలో క్రికెట్ అకాడమీని నెలకొల్పారు. తమకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఆటకు కొంతైనా సేవ చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెల చివరి నుంచి ఈ అకాడమీ అందుబాటులోకి రానుంది. ‘చాలా కాలంగా అకాడమీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ అకాడమీలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. మొదట 8-9 వారాల కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండో దశకు వెళ్తారు. ఆటకు సంబంధించిన మౌలిక వసతులున్న పాఠశాలకు వెళ్లి అక్కడ కూడా కోచింగ్ ఇస్తాం.
ఏడాది మొత్తం ఇది అందుబాటులో ఉంటుంది’ అని పఠాన్ బ్రదర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అకాడమీని మరో మూడు నగరాలకు విస్తరించనున్నామని చెప్పిన బ్రదర్స్... 2015 చివరికి 50 అకాడమీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అకాడమీలోని కోచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్, కామె రూన్ ట్రెడ్‌వెల్‌లతో తాము ఒప్పందం చేసుకున్నామన్నారు. అకాడమీల సంగతిని పక్కనబెడితే తమలో 5 నుంచి 7 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని వెల్లడించారు.