మాకొద్దీ ‘కోటీశ్వరులు’
అగ్రశ్రేణి ఆటగాళ్లను వదిలించుకున్న ఫ్రాంచైజీలు
⇒ యువరాజ్‌ను తప్పించిన బెంగళూరు
⇒ ఢిల్లీ జట్టు నుంచి 13 మంది అవుట్
⇒ ముగిసిన ఐపీఎల్ బదిలీలు
ముంబై: ఐపీఎల్-7 వేలం... యువరాజ్ సింగ్ ఎలాగైనా కావాల్సిందేనని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టుదల... ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా అతడి మాటకు విలువిచ్చింది. ఏకంగా రూ. 14 కోట్లు పెట్టి యువరాజ్‌ను సొంతం చేసుకుంది. అదే తరహాలో ఈసారి కూడా కోహ్లి, యువీకి అండగా నిలిచాడు. ఇంకా మ్యాచ్ విన్నరే కాబట్టి తప్పించవద్దంటూ మద్దతు పలికాడు. అయితే విజయ్ మాల్యా బృందం కోహ్లిని పట్టించుకోలేదు. భారీ మొత్తం తీసుకున్నా ఆ స్థాయిలో రాణించలేకపోయిన భారత స్టార్ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది.
ఆటగాళ్ల బదిలీల్లో భాగంగా యువరాజ్‌ను విడుదల చేసింది. ‘తెల్ల ఏనుగు’లా మారిన యువీని భరించలేమంటూ తేల్చేసింది. ఐపీఎల్-2014లో బెంగళూరు తరఫున యువరాజ్ 14 ఇన్నింగ్స్‌లతో కలిపి 376 పరుగులు చేశాడు. 22.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను ఐదు వికెట్లు పడగొట్టాడు.
గత ఐపీఎల్‌లో ఆర్‌సీబీ చివరినుంచి రెండో స్థానంలో నిలిచింది. నిబంధనల ప్రకారం యువరాజ్ 2015 ఐపీఎల్ వేలంలోకి వచ్చినప్పుడు ఏ ఫ్రాంచైజీ అయినా అతడిని వేలంలో తీసుకుంటే... అదే మొత్తాన్ని సదరు జట్టుకు చెల్లించి బెంగళూరు మళ్లీ వెనక్కి తీసుకోవచ్చు. ఆర్‌సీబీ దీనిని వాడుకొని తక్కువ మొత్తంలో యువీని మళ్లీ తీసుకునే చాన్స్ ఉంది.
దినేశ్ కార్తీక్ అవుట్
ఐపీఎల్‌లో భారీ మొత్తంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లను తప్పించి, పొదుపు మంత్రం పాటించేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. స్టార్లుగా గుర్తింపు ఉన్నవారు విజయాలు అందించకపోవడంతో వారికంటే ఇతర యువ ఆటగాళ్లను నమ్ముకోవడమే నయమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐపీఎల్-7లో చిట్టచివరి స్థానంలో నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా పెద్ద ఎత్తున మార్పులు చేసింది. ఆ జట్టు ఏకంగా 13 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. తమ జట్టులో 11 మందిని మాత్రమే వచ్చే సీజన్‌కు కొనసాగించనుంది.
గత వేలంలో రెండో అత్యధిక మొత్తంతో రూ. 12.50 కోట్లకు కొనుక్కున్న దినేశ్ కార్తీక్‌ను ఆ జట్టు విడుదల చేసింది. కార్తీక్‌తో పాటు ఇతర ‘విలువైన’ ఆటగాళ్లను కూడా ఆ జట్టు కాదనుకుంది. పీటర్సన్ (రూ. 9 కోట్లు), మురళీవిజయ్ (రూ. 5 కోట్లు), రాస్ టేలర్ (రూ. 2 కోట్లు)లను ఆ జట్టు తప్పించింది. ప్రధాన ఆటగాళ్లలో డుమిని, డి కాక్, షమీలను మాత్రం ఢిల్లీ కొనసాగించనుంది. ప్రస్తుత ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఇతర ఆటగాళ్లలో పుజారా, బాలాజీ, మురళీ కార్తీక్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తదితరులు ఉన్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు జహీర్ ఖాన్ (రూ. 2.60 కోట్లు), ప్రజ్ఞాన్ ఓజా (రూ. 3.25 కోట్లు) లను వదిలి పెట్టగా... సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ స్యామీ (రూ. 3.50 కోట్లు), అమిత్ మిశ్రా (రూ. 4. 75 కోట్లు), ఇర్ఫాన్ పఠాన్ (రూ. 2.40 కోట్లు), ఫించ్ (రూ. 4 కోట్లు), హోల్డర్ (రూ. 75 లక్షలు), వేణుగోపాలరావు (రూ. 55 లక్షలు) లను... విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హిల్ఫెన్హాస్, డేవిడ్ హస్సీలను... ఢిల్లీ డేర్‌డెవిల్స్ పార్నెల్, ఇమ్రాన్ తాహిర్, రాహుల్ శర్మ, నీషామ్‌లను... రాజస్థాన్ రాయల్స్ బ్రాడ్ హాడ్జ్, కూపర్‌లను విడుదల చేసింది.