నిరాశపరిచిన యువీ, భారత్ ‘ఎ’ ఓటమి
వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో జరిగిన అనధికార రెండో వన్డేలో భారత్ ‘ఎ’ టీమ్ పరాజయం పాలయింది. ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలన్న భారత ఆశలు నెరవేరలేదు. చిన్నస్వామి మైదానంలో మంగళవారం జరిగిన రెండో వన్డేలో 55 పరుగులతో భారత్ ఓటమి పాలయింది. విండీస్ నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటయింది.
మొదటి మ్యాచ్‌లో అంచనాలను అందుకుని సూపర్ సెంచరీతో జట్టుకు 77 పరుగుల విజయాన్ని అందించిన యువరాజ్ సింగ్ ఈ మ్యాజిక్ పునరావృతం చేయలేకపోయాడు. 40 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఉన్ముక్త్ 38, జాదవ్ 35, ఓజా 34, నదీం 21 పరుగులు చేశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. కార్టర్(133) సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3, యూసఫ్ పఠాన్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో విండీస్ సమం చేసింది.