నీలాంటి సహచరుల అండతోనే... | Yuvraj Singh is in the team because MS Dhoni is no longer the captain | Sakshi
Sakshi News home page

నీలాంటి సహచరుల అండతోనే...

Published Thu, Jan 12 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

నీలాంటి సహచరుల అండతోనే...

నీలాంటి సహచరుల అండతోనే...

కెప్టెన్‌గా ఇన్ని విజయాలు సాధించాను
యువరాజ్‌తో ధోని ఆత్మీయత  


ముంబై: ధోని, యువరాజ్‌ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఎన్నోసార్లు ప్రచారంలోకి వచ్చినా ఈ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం బహిరంగంగా ఎప్పుడూ దానిని ప్రదర్శించలేదు. దశాబ్ద కాలం పాటు సహచరులుగా కలిసి ఆడిన తమ మధ్య మంచి స్నేహం ఉందంటూ ఈ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు చెప్పుకున్నారు. కెప్టెన్‌గా ధోని సాధించిన రెండు ప్రపంచకప్‌లలో కూడా యువరాజ్‌ ఎంతో కీలక పాత్ర పోషించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన సమయంలో వీరిద్దరే క్రీజ్‌లో ఉన్నారు. మంగళవారం జరిగిన వార్మప్‌తో కెప్టెన్‌గా ఆఖరి మ్యాచ్‌ ఆడిన ధోనిని యువరాజ్‌ సరదాగా ఇంటర్వూ్య చేశాడు. ధోని భుజంపై చేతులు వేసి యువీ ఆత్మీయంగా మాట్లాడాడు.

‘కెప్టెన్‌గా కెరీర్‌ ముగించిన ధోనికి అభినందనలు. 3 ప్రధాన విజయాలు, అందులో 2 ప్రపంచకప్‌లు, పాత ధోనిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది’ అనే వ్యాఖ్యతో సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌లలో యువరాజ్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా అతను అడిగిన ప్రశ్నలకు ఎమ్మెస్‌ అదే తరహాలో జవాబిచ్చాడు. భారత కెప్టెన్‌గా నీ ప్రయాణం ఎలా అనిపించిందంటూ యువీ ప్రశ్నించగా, ‘చాలా అద్భుతంగా సాగింది. నీలాంటి ఆటగాళ్లు అండగా నిలవడం వల్లే నా పని సులువైంది. ఈ పదేళ్లు బాగా ఆస్వాదించాను. ఇక మిగిలిన క్రికెట్‌ను కూడా ఇలాగే ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నా’ అని మహి జవాబిచ్చాడు. ధోని నాయకత్వంలో ఆడే అవకాశం రావడం గొప్ప అనుభవమని, తన అత్యుత్తమ కెప్టెన్‌ అతనేనని సహచరుడిపై యువరాజ్‌ ప్రశంసలు కురిపిం చాడు. నువ్వు కొట్టిన ఆరు సిక్సర్లను అతి దగ్గరి నుంచి చూడనిచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ధోని వ్యాఖ్యానించగా, ఎప్పటిలాగే తాను ఆ బంతులను బాదేందుకు అవకాశమిచ్చావంటూ యువీ థ్యాంక్స్‌ చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నావు కాబట్టి మరిన్ని సిక్సర్లు బాదుతావా అంటూ ధోనినే యువీ మళ్లీ ప్రశ్నిం చగా... అందుకు తగిన బంతి లభించి, పరిస్థితి అనుకూలంగా ఉంటే సిక్సర్లు కొడతానంటూ మాజీ కెప్టెన్‌ ప్రత్యుత్తరమిచ్చాడు.  

ధోని కెప్టెన్‌గా లేనందువల్లే...
చండీగఢ్‌: ధోనితో యువరాజ్‌ ఎంత సన్నిహితంగా ఉన్నా... మరోవైపు యువీ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మాత్రం ఎప్పటిలాగే ధోనిపై తన అసంతృప్తిని దాచుకోలేదు. ‘ధోని కెప్టెన్‌ కాకపోవడం వల్లే నా కొడుకు మళ్లీ జట్టులోకి రాగలిగాడు. రెండేళ్ల క్రితమే నేను దీనిని ఊహించగా, ఇంత కాలానికి ఇది నిజమైంది’ అని యోగ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు.  

కలా, నిజమా అనిపిస్తోంది!
మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్సీపై విరాట్‌ కోహ్లి   

పుణే: జీవితంలో మనకు దక్కే ప్రతీది దేవుడు ఇచ్చినట్లుగానే భావిస్తున్నానని, ఏది జరిగినా దానికి కారణం తప్పనిసరిగా ఉంటుందని, సరైన సమయంలోనే అది జరుగుతుందని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. మూడు ఫార్మాట్‌లలోనూ తాను కెప్టెన్‌ కావడం కూడా అలాంటిదేనని అతను చెప్పాడు. తన ప్రయాణం ఇక్కడి వరకు సాగుతుందని ఊహించలేదన్నాడు. ‘మూడు ఫార్మాట్‌లలోనూ కెప్టెన్సీ నన్ను ఆశ్చర్యపరుస్తోంది. అంతా ఒక కలలా భావిస్తున్నాను. నా జీవితంలో ఇంత గొప్ప రోజు వస్తుం దని ఊహించలేదు. బాగా ఆడటం, మరిన్ని అవకాశాలు దక్కించుకొని కెరీ ర్‌లో నిలకడను ప్రదర్శించి జట్టును గెలిపించడం గురించి మాత్రమే నేను ఆలోచించేవాడిని. జూనియర్‌ స్థాయిలో ఎక్కడ ఆడినా నేను కెప్టెన్‌గానే ఉన్నా ను కానీ భారత జట్టు కెప్టెన్‌ అనేది అన్నింటికంటే భిన్నం’ అని కోహ్లి అన్నాడు. ఎవరినీ అనుసరించకుండా సొంత ఆటపైనే నమ్మకం ఉంచాలని సచిన్‌ చెప్పిన సూచనను అనుసరించానన్న విరాట్‌... వ్యక్తిగతంగా తన కెరీర్‌లో ఇటీవల ముంబైలో ఇంగ్లండ్‌పై చేసిన డబుల్‌ సెంచరీ, టి20 ప్రపంచకప్‌లో మొహా లీలో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లు తనకు ప్రత్యేకమని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement