
యువీ, ధోనీ సెంచరీల సీక్రెట్ ఇదే..
కటక్: టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. కీలక సమయంలో సెంచరీ చేసి జట్టుకు విజయాన్నందించడంతో పాటు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతంలో విలువైన భాగస్వామ్యాల్ని నెలకొల్పి, ఎన్నోసార్లు జట్టును గెలిపించిన వెటరన్స్ యువీ, ధోనీలు కటక్ వన్డేలో మరోసారి చెలరేగి సూపర్ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్లో ఆడుతున్న సమయంలో ధోనీ తనలో ఆత్మవిశ్వాసం నింపాడని, సెంచరీ చేయడానికి ఎంతో ఉపయోగపడిందని యువీ అన్నాడు.
‘ధోనీకి, నాకు మధ్య మంచి అవగాహన ఉంది. కటక్ మ్యాచ్‌లో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఆడాం. తొలుత 50 పరుగుల భాగస్వామ్యం చేయాలని అనుకున్నాం. ఇది సాధించాక 100 పరుగుల భాగస్వామ్యంపై దృష్టిసారించాం. ఆ తర్వాతే అదే జోరు కొనసాగిస్తూ సెంచరీలు చేశాం. గతంలో మేం ఎన్నో మ్యాచ్లను గెలిపించాం. మా ఇద్దరిలో ఆత్మవిశ్వాసం ఉంది. కటక్ వన్డేలో నేను బౌండరీలు సాధించడాన్ని గమనించిన ధోనీ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఇది బాగా పనిచేసింది. ధోనీ నన్ను ప్రోత్సహిస్తూ ఆత్మవిశ్వాసం కలిగించాడు’ అని యువీ చెప్పాడు.
యువీ (150) ఆరేళ్ల తర్వాత, ధోనీ (134) నాలుగేళ్ల తర్వాత సెంచరీలు చేశారు. వన్డేల్లో యువీకిదే అత్యధిక స్కోరు. యువీ చివరిసారిగా 2011 వన్డే ప్రపంచ కప్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత కేన్సర్ బారినపడిన యువీ జట్టుకు దూరమయ్యాడు. కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాక జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే మునుపటిలా ఆడలేకపోయిన యువీ జట్టుకు కొన్నాళ్లు దూరమయ్యాడు. అనూహ్యంగా మళ్లీ జట్టులోకి వచ్చిన యువీ కటక్‌లో అద్భుతం చేశాడు.