
సారీ... మీరొద్దు!
యువరాజ్, సెహ్వాగ్‌లకు మొండిచెయ్యి
హర్భజన్, గంభీర్, జహీర్‌లకూ నిరాశే
ప్రపంచకప్‌కు 30 మంది భారత ప్రాబబుల్స్ ఎంపిక
జనవరి 7లోగా 15 మందితో జట్టు ప్రకటన
ముంబై: గత వైభవం, జ్ఞాపకాలను పట్టించుకోనే లేదు... వర్తమానానికే విలువ, గుర్తింపు... భవిష్యత్తుపై, ముందుకు వెళ్లటంపైనే దృష్టి... భారత క్రికెట్ జట్టును ఎంపిక చేయడంలో సెలక్టర్లు పాటించిన సూత్రం ఇది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం గురువారం 30 మంది సభ్యుల ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. చాలా రోజులుగా నిలకడగా రాణిస్తున్న, ఇటీవల అవకాశం దక్కిన ప్రతి చోటా తమ ప్రతిభను ప్రదర్శించిన యువ ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. 2011 ప్రపంచకప్ విజయంలో భాగమైన సీనియర్ ఆటగాళ్లు ఐదుగురికి ఇందులో స్థానం లభించలేదు. నాడు కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, జహీర్‌ఖాన్‌లను ఎంపిక చేయలేదు.
వీరంతా తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు ఏడాది కావస్తున్నా... ఆసీస్ గడ్డపై అనుభవం అక్కరకు వస్తుందనే కారణంతో ఏదో మూల ఒక ఆశ ఉండేది. కానీ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆ ఆశలకు తెర దించింది. సీనియర్లకన్నా కొత్త కుర్రాళ్లపైనే నమ్మకం ఉంచడం ఉత్తమమంటూ తమ మనోభావాన్ని బయట పెట్టింది. ప్రాబబుల్స్ నుంచి 15 మంది సభ్యుల తుది జట్టును ప్రకటించేందుకు జనవరి 7 వరకు గడువు ఉంది.
ఊహించినట్లుగానే...
2011లో జగజ్జేతగా నిలిచిన జట్టులో భాగమైన ధోని, కోహ్లి, రైనా, అశ్విన్ మాత్రమే ఇప్పుడు టీమ్‌లో ఉన్నారు. మిగతా 11 మంది ఈ సారి జట్టుకు దూరమయ్యారు. యువ క్రికెటర్లను ఎంపిక చేయడంలో కూడా ఎలాంటి సంచలనాలు లేవు.
ఇటీవల జాతీయ జట్టు తరఫున, దేశవాళీలో కూడా రాణించిన ఆట గాళ్లకే అవకాశం దక్కింది. పుజారాను ఇంకా సెలక్టర్లు వన్డే ఆటగాడిగా గుర్తించకపోగా, కర్ణాటకకు దేశవాళీలో వరుసగా నాలుగు టైటిల్స్ అందించినా...వినయ్ కుమార్‌కు నిరాశ తప్పలేదు. ధోనితో పాటు మరో ముగ్గురు కీపర్లు అందుబాటులో ఉండటంతో దినేశ్ కార్తీక్, నమన్ ఓజాలను కూడా పక్కన పెట్టారు. ఎంపికలో ప్రస్తుత ఫామ్‌నే పరిగణలోకి తీసుకున్నారు. ఇది కూడా సీనియర్లకు ప్రతికూలంగా మారింది.
‘సెలక్షన్ కోసం సీనియర్ల పేర్లు కూడా పరిశీలించాం. ప్రతీ ఒక్కరి గురించి చర్చ జరిగింది. అయితే బాగా ఆడుతున్నవారినే ఎంపిక చేయాలని అందరం నిర్ణయించాం. కుర్రాళ్లు దేశవాళీలో చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి వారిని పక్కన పెట్టలేము. ఏవైనా తీవ్ర గాయాలు అయితే తప్ప ఈ జాబితానుంచే ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేస్తాం. సెలక్షన్‌లో కెప్టెన్ సూచనలను కూడా పరిశీలనలోకి తీసుకున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు.
భారత ప్రాబబుల్స్
బ్యాట్స్‌మెన్: ధావన్, రోహిత్, రహానే, కోహ్లి, రైనా, రాయుడు, కేదార్ జాదవ్, మనోజ్ తివారి, మనీశ్ పాండే, మురళీ విజయ్ పేస్ బౌలర్లు: ఇషాంత్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్, ఆరోన్, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, అశోక్ దిండా స్పిన్నర్లు: అశ్విన్, రసూల్, కరణ్ శర్మ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్
వికెట్ కీపర్లు: ఎంఎస్ ధోని, ఉతప్ప, సంజు శామ్సన్, వృద్ధిమాన్ సాహా
ఖేల్ ఖతం..!
నేను భవిష్యత్తులో భారత్‌కు ఆడతానో, లేదో... నెల క్రితం యువరాజ్ సింగ్ సంశయం, ఆపై వెంటనే మళ్లీ వస్తానంటూ ఆత్మవిశ్వాసం.
ప్రపంచ కప్‌కు ఎంపికవుతానని నాకు ఇంకా నమ్మకముంది...మూడు రోజుల క్రితం సెహ్వాగ్ మనసులో మాట.
ఐపీఎల్‌లో నేనే భారత అత్యుత్తమ స్పిన్నర్‌ను...ఈ ప్రదర్శన నన్ను కాపాడుతుందంటూ కొన్నాళ్ల క్రితం హర్భజన్ ఆశతో చేసిన వ్యాఖ్య.
ఇక ఆటతోనే తన విలువ చూపాలని ప్రతీ దేశవాళీ మ్యాచ్ బరిలోకి దిగిన గంభీర్...ఆస్ట్రేలియాలో అనుభవమే తనకు కలిసొస్తుందనే విశ్వాసంతో జహీర్ ఖాన్.
సాక్షి క్రీడావిభాగం: ఇప్పటి వరకు ఏదో ఒక ఆశ, నమ్మకం వీరి ఆలోచనలను ప్రపంచ కప్ వైపు నడిపించింది. అయితే భారత సెలక్టర్లు వీరి అన్ని కోరికలకు అడ్డుకట్ట వేశారు. ఇక మీరు అవసరం లేదంటూ తలుపులు మూసేశారు. ప్రపంచ కప్ కోసమే కాదు ఆ తర్వాతి భవిష్యత్తు కోసమే కుర్రాళ్లను ఎంపిక చేశామంటూ బోర్డు కుండబద్దలు కొట్టింది. ఈ ఐదుగురికి కనీసం ప్రాబబుల్స్‌లో చోటు దక్కినా ఆశ పడేందుకు అవకాశం ఉండేది.
ఎందుకంటే ఇక్కడ దేశవాళీలో అద్భుతంగా ఆడితే, అక్కడ ఆస్ట్రేలియాలో కుర్రాళ్లు విఫలమైతే...అప్పుడైనా సీనియర్ల అవసరం గుర్తుకు వచ్చి ఎంపికయ్యేవారేమో! ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే. ఏదైనా ‘మర్యాదపూర్వక వీడ్కోలు’ కోసం ప్రత్యేకంగా బీసీసీఐ మరో మ్యాచ్‌కు అవకాశం ఇస్తే తప్ప ఇకపై వీరు భారత్ తరఫున ఆడటాన్ని మనం చూడకపోవచ్చు. 2011 ప్రపంచ కప్ విజయంలో భాగమై ఇప్పుడు ప్రాబబుల్స్‌లో స్థానం లభించని (11 మంది) ఆటగాళ్లను చూస్తే...
యువరాజ్ సింగ్: గత వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యువరాజ్ పాత్రను 1983లోని మొహిందర్ అమర్‌నాథ్‌తో పోల్చారు. ఇప్పుడూ అదే పోలిక చెప్పవచ్చేమో. ఎందుకంటే అమర్‌నాథ్‌కు కూడా 1987 ప్రపంచ కప్‌లో చోటే దక్కలేదు. ఇప్పడు యువీ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది!
2011 ఫైనల్ అనంతరం ఆడిన 16 వన్డే ఇన్నింగ్స్‌లలో యువరాజ్ 18.53 సగటుతో కేవలం 278 పరుగులు మాత్రమే చేసి, 2 వికెట్లే పడగొట్టడం అతని ఫామ్‌లేమిని సూచిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో ఆఖరి వన్డే ఆడిన యువీ విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 168 పరుగులే చేశాడు. యువీ శైలిలో ఆడే జడేజా, అక్షర్ నిలదొక్కుకోవడంతో అతని చోటు పోయింది.
వీరేంద్ర సెహ్వాగ్: 2013 జనవరిలో ఆఖరి వన్డే. గత రెండేళ్లలో 13 వన్డేల్లో సగటు 20.23 మాత్రమే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో ఒకే అర్ధ సెంచరీ. రోహిత్ నిలదొక్కుకొని భారీ స్కోరు చేస్తుండటంతో చాన్స్ పోయింది.
గంభీర్: 2013 జనవరిలో ఆఖరి వన్డే. గత రెండేళ్ళలో 30 మ్యాచ్‌ల్లో సగటు 23.58 మాత్రమే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో ఒకే అర్ధ సెంచరీ. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌గా ధావన్ దూకుడైన ఆటతో గుర్తింపు తెచ్చుకోవడం గంభీర్ అవకాశాలు దెబ్బ తీసింది.
హర్భజన్ సింగ్: 2011 జూన్‌లో ఆఖరి వన్డే. విజయ్ హజారే ఆరు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు మాత్రమే తీశాడు. అశ్విన్ ఎలాగూ జట్టులో ఉన్నాడు. గత సారే అతనితో పోటీ పడాల్సి వచ్చింది. కాబట్టి భజ్జీకి తలుపులు మూసుకుపోయాయి.
జహీర్ ఖాన్: సుదీర్ఘ కాలంగా ఫిట్‌నెస్ సమస్యలు. మేలో ఐపీఎల్ తర్వాత పోటీ క్రికెట్ ఆడనే లేదు. 2012 ఆగస్టులో ఆఖరి వన్డే ఆడిన జహీర్ గాయంనుంచి ఇంకా కోలుకోలేదు. జట్టులో ఉన్న భారత పేసర్లు ఇప్పటికే తమను తాము నిరూపించుకొని స్థిరపడ్డారు. ఇక గత ప్రపంచ కప్ ఆడినవారిలో సచిన్ రిటైర్ కాగా, శ్రీశాంత్‌పై నిషేధం వేటు పడింది. ఇతర ఆటగాళ్లు మునాఫ్, నెహ్రా, చావ్లా, యూసుఫ్ పఠాన్ చురుగ్గా లేకపోవడంతో పాటు వరుసగా విఫలమయ్యారు.