ఒక్క చెడ్డ రోజు...!
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి,వెనకటికి ఎవడో సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో పడ్డాడని సామెత. ప్రతి టోర్నీలోనూ ఎన్ని విజయాలు సాధించిన జట్టుకైనా ఏదో ఒక దశలో ఒక చెడు రోజు ఉంటుంది. దురదృష్టం ఏంటంటే భారత్‌కు అది ఫైనల్ అయింది. టి20 ప్రపంచకప్ మొదటి నుంచి అన్ని లీగ్ మ్యాచ్‌లు, సెమీస్‌లో చెలరేగి ఆడిన భారత్... కీలకమైన ఫైనల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. రెండో ఓవర్‌లోనే రహానే వికెట్ కోల్పోవడంతో టి20లకు అవసరమైన మెరుపు ఆరంభం దొరకలేదు.
దీనికితోడు రోహిత్, కోహ్లి ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఆడారు. చేతిలో వికెట్లు ఉంటే చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేయొచ్చు. గతంలో ఈ వ్యూహం భారత్‌కు బాగా పనికొచ్చింది. కానీ ఫైనల్లో యువరాజ్ పుణ్యమాని తేలిపోయాం. ఇక బౌలర్లను పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. లక్ష్యం చిన్నదే కావడంతో వాళ్లు కూడా ఒత్తిడిలోకి వెళ్లారు. ముఖ్యంగా అశ్విన్ మీద బాగా ఒత్తిడి పెంచారు. అలాగే ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ధోని తొలిసారి విఫలమయ్యాడు.
శభాష్ విరాట్...
భారత్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి తన క్లాస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. చక్కగా ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆఖరి ఐదు ఓవర్లలో హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధం చేశాడు. ఒక దశలో కోహ్లి సెంచరీ కూడా చేయొచ్చనిపించింది. కానీ యువీ, ధోని కలిసి కోహ్లికి కనీసం సరిగా స్ట్రయికింగ్ కూడా ఇవ్వలేకపోయారు.
ఓవరాల్‌గా టోర్నీలో భారత ప్రదర్శన పేలవంగా ఏమీ లేదు. ఒక్క ఫైనల్‌ను మినహాయిస్తే చాంపియన్ తరహా ఆటతీరునే ప్రదర్శించింది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన ధోని... ఈసారి మాత్రం విఫలమయ్యాడు. అయితే ఏమాత్రం అంచనాలు లేకుండా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరడం ద్వారా కాస్త గౌరవంగానే స్వదేశానికి బయల్దేరుతోంది.