హరారే:జింబాబ్వే క్రికెట్ రోజు రోజుకు దిగజారిపోతున్నదనడానికి తాజా ఘటనే ఉదాహరణ. జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్థికంగా పీకల‍్లోతు కష్టాల్లో కూరుకుపోవడంతో తమకు అప్పు కావాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించింది. తమ వద్ద మ్యాచ్‌లు నిర్వహించడానికి అస్సలు డబ్బులు లేవని, ఏమైనా రుణ సాయం చేస్తే ఒకడుగు ముందుకు వేస్తామని జింబాబ్వే క్రికెట్ బోర్డు లేఖలో ఐసీసీకి విన్నవించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. జింబాబ్వేలో పర్యటించాలి. ఆ ద్వైపాక్షిక సిరీస్‌లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ 20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్ధిక కష్టాల కారణంగా పాక్‌తో సిరీస్‌ను నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది.
మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా ఆతిథ్యం ఇవ్వలేమంటే చెప్పండి.. ప్రత్యామ్నాయాలు చూసుకుంటామంటూ జింబాబ్వే క్రికెట్ బోర్డుకు సందేశాలు పంపింది. దీంతో జింబాబ్వే బోర్డు.. ఐసీసీ మద్దతు కోరింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ ధృవీకరిస్తూ.. 'ఐసీసీ మద్దతు కోరామని.. పర్యటనపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని ఏప్రిల్ వరకు ఆగమంటూ జింబాబ్వే బోర్డు మమ్మల్ని కోరింది. ఒక వేళ ఈ ప్రయత్నంలో జింబాబ్వే విఫలమైతే మేం ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తాం' అని పేర్కొన్నారు. గతంలో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పలు సందర్బాల్లో ఆ దేశ క్రికెటర్లకు కిట్లు బహుమతులుగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment