
హరారే: వన్డే ప్రపంచకప్–2019కు అర్హత సాధించడంలో జింబాబ్వే జట్టు విఫలమవడంతో కెప్టెన్ గ్రేమ్ క్రేమర్‌తో పాటు కోచింగ్ స్టాఫ్‌పై వేటు పడింది. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయిన జింబాబ్వే పై ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది.
క్రేమర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి అతని స్థానంలో బ్రెండన్ టేలర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. హెడ్ కోచ్ హీత్ స్ట్రీక్, బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్, బౌలింగ్ కోచ్ డగ్లస్ హోండో, ఫీల్డింగ్ కోచ్ వాల్టర్ చవగుట, ఫిట్‌నెస్ కోచ్ సీన్ బెల్, అనలిస్ట్ స్టాన్లె చీజాలతో పాటు శిక్షణ బృందాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. వీరితో పాటు సెలక్షన్ కమిటీ కన్వీనర్ తతేంద తైబు, అండర్–19 కోచ్ స్టీఫెన్ మాన గోంగోలను కూడా వారి పదవుల నుంచి తొలగించింది. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచకప్‌నకు అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి.