
కుర్రాళ్లు గర్జిస్తున్నారు. అండర్–19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్నారు. ఆసీస్‌పై 100 పరుగులతో జయభేరి మోగించిన యువ భారత్... వరుస మ్యాచ్‌ల్లో పపువా న్యూ గినియా, జింబాబ్వేలను 10 వికెట్లతో చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో ఎదురు లేని జట్టుగా అగ్రస్థానంలో నిలి చింది. ఈనెల 26న జరిగే క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.
మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ఐసీసీ అండర్–19 ప్రపంచకప్‌లో కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో యువ భారత్ అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే క్వార్టర్స్ చేరిన పృథ్వీ షా బృందం వరుసగా మూడో విజయంతో గ్రూప్‘బి’లో అజేయంగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగుల వద్ద ఆలౌటైంది. మిల్టన్ శుంబా (59 బంతుల్లో 36; ఒక సిక్స్) టాప్ స్కోరర్. మధెవెరె (30; 3 ఫోర్లు), కెప్టెన్ రోచ్ (31; ఫోర్, సిక్స్) రాణించారు. భారత బౌలర్లు అనుకూల్ రాయ్ (4/20), అభిషేక్ వర్మ (2/22), అర్షదీప్ సింగ్ (2/10) జింబాబ్వేను దెబ్బతీశారు. ఒకదశలో జింబాబ్వే 110/3 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అయితే లెఫ్టార్మ్ స్పిన్నర్లు అనుకూల్, అభిషేక్‌లు తిప్పేయడంతో 44 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లు కోల్పోయింది. తర్వాత 155 పరుగుల సునాయాస లక్ష్యాన్ని భారత్ కేవలం 21.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్ (59 బంతుల్లో 90 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్), హార్విక్ దేశాయ్ (73 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీలతో కదంతొక్కారు. శుభ్‌మాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, పపువా న్యూగినియాలపై గెలుపొందిన భారత్... ఈనెల 26న జరిగే క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
బెంబేలెత్తించిన రాల్స్‌టన్ (7/15)
క్రికెట్ కూన పపువా న్యూ గినియా (పీఎన్‌జీ)పై ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. తమ చివరి లీగ్‌లో ఆసీస్ 311 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట 8 వికెట్లకు 370 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... తర్వాత పీఎన్‌జీని 24.5 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూల్చింది. ఆసీస్ బౌలర్ జాసన్ రాల్స్‌టన్ (7/15) నిప్పులు చెరిగాడు. టోర్నమెంట్ చరిత్రలో ఏడు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మెక్‌స్వీని (156; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్ జాసన్ జస్‌కీరత్ సింగ్ సంఘా (88; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), పరమ్ ఉప్పల్ (61; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. గ్రూప్ ‘బి’లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్ చేరింది. గ్రూప్ ‘డి’లో శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్ కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment