
ఆ..11మంది ఎక్కడ?
ఐఎస్‌ఐఎస్ మద్దతుదారులు 11 మంది చెన్నైలో తిష్ట వేసినట్టుగా లభించిన ఆధారాలతో వారికోసం వేట మొదలైంది. రాజస్థాన్ నుంచి ప్రత్యేక బృందం రంగంలోకి దిగి వారెక్కడ ఉన్నారోనని ఆరాతీస్తోంది. చాప కింద నీరులా చెన్నైలో ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలు విస్తరిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.
♦ చెన్నైలో తిష్టవేసిన ఐఎస్‌ఐఎస్ మద్దతుదారులు
♦ చాప కింద నీరులా విస్తరణ
♦ ఆచూకీ కోసం రాజస్థాన్ బృందం వేట
♦ ముగ్గురికి సమన్లు
సాక్షి, చెన్నై : రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక నగరం మదురై తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉండడంతో భద్రతపరంగా అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏదేని తీవ్రవాద కార్యకలాపాలు బయటపడ్డ పక్షంలో, అది చెన్నై చుట్టూ తిరుగుతుండడం ఉత్కంఠను రేపుతోంది.
ఇదివరకు అల్ ఉమ, సిమి వంటి నిషేధిత తీవ్రవాద సంస్థలపై గురిపెట్టి వారి మద్దతుదారుల్ని ఏరిపారేశారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కాలంగా రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ నినాదం మార్మోగుతుండడంతో భద్రతపరంగా ఆందోళనలు తప్పడం లేదు. గత ఏడాది చివరల్లో కేరళలో ఐఎస్‌ఐఎస్ కదలికల్ని జాతీయ నేర పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. ఈకేసు విచారణ మేరకు చెన్నైలో ఒకరు, తిరునల్వేలి జిల్లా కడయనల్లూరులో మరొకర్ని ఎన్‌ఐఏ వర్గాలు అరెస్టుచేశాయి. అలాగే, ఐఎస్‌ఐఎస్ ప్రధాన కేంద్రం సిరియాకు వెళ్లే క్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు వివిధ దేశాల్లో అరెస్టు కావడం ఆందోళన రేపుతోంది.
ఐఎస్‌ఐఎస్ వలలో మరెవరైనా పడిఉన్నారా..? అన్న ఆందోళన నెలకొనడంతో చాపకింద నీరులా సాగుతున్న అసాంఘిక వ్యవహారాల గుట్టు రట్టు చేయడానికి తమిళ పోలీసు దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. ఇందుకు కారణం, ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు, ప్రత్యేక బృందాలు ఇక్కడికి వచ్చి ఆ సంస్థ మద్దతుదారుల్ని చడీ చప్పుడు కాకుండా పట్టుకెళ్తుండడమే. ఇక, రాష్ట్రంలో ఇటీవల హిందూ సంఘాల నేతల్ని గురిపెట్టి దాడులు సాగుతుండటం, ఐఎస్‌ఐఎస్‌కు నిధుల్ని సేకరించి పంపించే వాళ్లు పెరుగుతుండడం బట్టి చూస్తే నిషేధిత కార్యకలాపాలు చాప కింద నీరులా మరింతగా విస్తరిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
మద్దతుదారులు ఎక్కడున్నారు?
కేంద్ర నిఘా సంస్థ గత కొన్ని నెలలుగా రాష్ట్రం మీద గురి పెట్టి తరచూ నిషేధిత సంస్థ మద్దతుదారుల్ని తన్నుకెళ్తూ వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో ఉత్కంఠ తప్పడం లేదు. తమకు పట్టుబడ్డ జమిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన రాజస్థాన్ పోలీసులు గత వారం మైలాపూర్‌లోని మహ్మద్ ఇక్బాల్‌ను అరెస్టుచేసి తీసుకెళ్లారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నైలో మరో 11 మంది ఐఎస్‌ఐఎస్ మద్దతుదారులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే, ఆ 11 మంది ఎక్కడున్నారో అన్న ప్రశ్న బయలుదేరింది.
వారి ఆచూకీ కోసం వేట మొదలెట్టేందుకు ప్రత్యేక బృందం రాజస్థాన్ నుంచి చెన్నైకి ఆదివారం దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళ పోలీసులతో కలసి ఆ మద్దతుదారుల కోసం వేట సాగుతుండడంతో ఐఎస్‌ఐఎస్‌కు ఆకర్షితులైన యువత మరెంతమంది ఉన్నారో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. వీరి వేట ఓవైపు సాగుతుంటే, మరోవైపు మన్నడికి చెందిన రాజా మహ్మద్, సికిందర్, చాకలి పేట నేతాజీనగర్‌కు చెందిన రియాజుద్దీన్‌లకు రాజస్థాన్ పోలీసులు సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ ముగ్గుర్ని తమ విచారణకు రావాలని ఆదేశించినట్టు, వీరు రాజస్థాన్‌కు బయలుదేరి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఆ ముగ్గుర్ని రాజస్థాన్‌లో అరెస్టు చేస్తారా..? వారి వద్ద సాగే విచారణ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏమేరకు నిషేధిత సంస్థ మద్దతుదారులు ఉన్నారో అనేది తేలనుంది.