
125 అభివృద్ధి కార్యక్రమాలకు 13న శంకుస్థాపన
► హాజరు కానున్న సీఎం
► ఎమ్మెల్యే వెంకటరమణయ్య వెల్లడి
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం తాలూకా గ్రామీణ, పట్టణ పరిధిలో 125 అభివృద్ధి పనులకు ఈ నెల 13న సీఎం సిద్ధరామయ్య శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే వెంకటరమణయ్య వెల్లడించారు. దివ్యాంగుల సమస్యలపై స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవనహళ్లి, దొడ్డబళ్లాపురం సరిహద్దులో ఉన్న చప్పరదకల్లు గ్రామం వద్ద రూ.43కోట్లతో జిల్లా కేంద్ర కార్యాలయాలకు 13న సీఎం శంకుస్థాపన జరుగనుందన్నారు.
ఇదే కార్యక్రమంలో పలు పథకాల కింద ఆదేశపత్రాలు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కార్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి కార్యాలయాలు ఒక్కచోట రావడం వల్ల జిల్లాలోని నాలుగు తాలూకాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు రెండు నెలల్లో త్రికచక్రవాహనాలు, డ్రైవింగ్ లెసైన్సులు అందజేస్తామన్నారు. అదేవిధంగా పేద దివ్యాంగులకు రెండువేల ఇళ్లు నిర్మిస్తామన్నారు.