
పదవీ గండం
అన్నాడీఎంకేలో నేతలకు పదవుల గండం ముంచుకొస్తున్నది. మరి కొద్ది రోజుల్లో జిల్లాల కార్యదర్శుల కొత్త చిట్టా వెలువడనున్నది.
కార్యదర్శుల్లో గుబులు
త్వరలో చిట్టా
16 మందికి ఉద్వాసన
అన్నాడీఎంకేలో ఉత్కంఠ
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో నేతలకు పదవుల గండం ముంచుకొస్తున్నది. మరి కొద్ది రోజుల్లో జిల్లాల కార్యదర్శుల కొత్త చిట్టా వెలువడనున్నది. దీంతో తమ చోటు పదిలమా..? అన్న సందిగ్ధంలో నేతలు పడ్డారు. 16 జిల్లాల కార్యదర్శులకు ఆ పార్టీ అధినే త్రి, సీఎం జయలలిత ఉద్వాసన పలికిన సమాచారం అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నది. అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత ఇటీవల జరిగిన ఆ పార్టీ సర్వ సభ్య, కార్యవర్గ సమావేశం ద్వారా ప్రధాన కార్యదర్శి పదవికి మళ్లీ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆమె ఎన్నిక అనంతరం పార్టీ పరంగా యూనియన్, నగర, మహానగర, డివిజన్, పట్టణ పంచాయతీ, పంచాయతీ, జిల్లా కమిటీల కార్యవర్గాల ఎన్నిక జరపడం ఆనవాయితీ. ఆ మేరకు సంస్థాగత ఎన్నికల పర్వానికి చర్యలు తీసుకున్నారు.
సీనియర్ మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, పళనియప్పన్, ఎడపాడి పళనిస్వామిల భుజాన సంస్థాగత ఎన్నికల బాధ్యతల్ని సీఎం , ఆ పార్టీ అధినేత్రి జయలలిత మోపారు. పార్టీ పరంగా అన్నాడీఎంకేలో యాభై జిల్లాలు ఉన్నాయి. తలా పది జిల్లాల్ని విభజించుకుని సంస్థాగత ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో సీనియర్ మంత్రులు సఫలీకృతులయ్యారు. గ్రామ, యూనియన్, నగర, మహానగర, పట్టణ పంచాయతీల కార్యవర్గాల ఎంపికకు ఐదు విడతలుగా, ఇక, జిల్లా కమిటీల నిర్వాహకుల ఎంపికకు రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఇంత వరకు బాగానే ఉన్నా, జిల్లాల కార్యదర్శుల ఎంపిక బాధ్యతల్ని మాత్రం జయలలిత తన భుజాన వేసుకున్నారు. దీంతో ప్రస్తుతం పదవుల్లో ఉన్న జిల్లాల కార్యదర్శుల్లో బెంగ బయలు దేరింది.
పదవీ గండం: సంస్థాగత సమరం ఏప్రిల్‌తో ముగిసింది. జయలలిత కేసుల తీర్పు , తదితర కారణాలతో పార్టీ పరంగా జిల్లాల కార్యదర్శుల ఎంపిక ప్రకటన వెలువడలేదు. తాజాగా, అన్ని పరిస్థితులు సద్దుమనిగాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అయ్యే రీతిలో ప్రభుత్వ ప్రగతిని చాటే కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయి. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలను విస్తృతం పరచడంలో నేతలు బిజీ బిజీగా ఉన్న సమయంలో జిల్లాల కార్యదర్శుల ఎంపిక పర్వం ముగిసిన సమాచారం అన్నాడీఎంకే వర్గాల్లో గుబులు రేపుతున్నది.
ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన కార్యదర్శులపై జయలలిత చెంతకు ఫిర్యాదులు వెల్లువెత్తి ఉన్నాయి. అలాగే, మరికొన్ని జిల్లాలకు కార్యదర్శులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. వీరిలో పలువురి పనితీరుపై జయలలిత అసంతృప్తితో ఉన్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో జిల్లాల కార్యదర్శుల జాబితా వెలువడనున్న ప్రకటన అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నది. ఎవరి పదవులు పదిలం. మరెవ్వరికీ ఉద్వాసన పలికి ఉంటారోనన్న చర్చ ఆ పార్టీలో బయలు దేరి ఉన్నది. అలాగే, 16 మంది జిల్లాల కార్యదర్శులకు ఉద్వాసన పలికి ఉన్నట్టుగా సమాచారం బయటకు పొక్కడంతో ఆ కార్యదర్శులు ఎవరోనన్న ఉత్కంఠ బయలు దేరి ఉన్నది. ప్రస్తుతం దక్కే జిల్లాల కార్యదర్శుల పదవుల ఆధారంగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల ద్వారా తమ భవిష్యత్తుకు బాటవేసుకోవచ్చన్న ఆశతో ఉన్న అన్నాడీఎంకే నాయకుల్లో ఎ ందరికి పదవులు దక్కుతాయో, మరెందరికి గండం పొంచి ఉన్నదో మరి కొద్దిరోజుల్లో తేలనున్నది.