
జమ 12.44 లక్షల కోట్లు..జారీ 4.61 లక్షల కోట్లు
ముంబై: రద్దయిన నోట్ల రూపంలో డిసెంబర్ 10 వరకూ బ్యాంకులకు రూ. 12.44 లక్షల కోట్ల మొత్తం చేరిందని ఆర్‌బీఐ తెలిపింది. ఇంతవరకూ రూ. 4.61 లక్షల కోట్ల మేర కొత్త నోట్లను జారీ చేశామంది. ‘రిజర్వ్ బ్యాంక్, కరెన్సీ చెస్ట్‌లకు రూ. 500, రూ. వెయ్యి నోట్ల రూపంలో రూ. 12.44 లక్షల కోట్లు చేరాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకూ 4.61 లక్షల కోట్లను బ్యాంక్ కౌంటర్లు, ఏటీఎంల ద్వారా చెలామణి చేశాం. ఇంతవరకూ 2,180 కోట్ల మేర వివిధ కరెన్సీ నోట్లు ముద్రించాం.
అందులో రూ10, రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లు 2,010 కోట్లు కాగా, రూ. 500, రూ. 2 వేల నోట్లు 170 కోట్ల వరకూ ఉన్నాయి’ అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ చెప్పారు. డిసెంబర్ 7 నుంచి రద్దయిన నోట్ల రూపంలో బ్యాంకులకు రూ. లక్ష కోట్లు చేరగా... కొత్త నోట్ల జారీ మాత్రం తక్కువగా ఉందన్నారు. బ్యాంకులు తరచూ నగదు వివరాల్ని తనిఖీ చేస్తూ ఉండాలని, ఏమైనా తేడాలు ఉన్నట్లు కనుగొంటే అంతర్గత ఆడిటింగ్ జరపాలని బ్యాంకులకు చెప్పినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
సీసీటీవీ ఫుటేజీని భద్రపరచండి
కొత్త నోట్లు అక్రమార్కులకు చేరుతుండడంతో ఆర్‌బీఐ అప్రమత్తమైంది. బ్యాంకు బ్రాంచీలు, కరెన్సీ చెస్టుల వద్ద సీసీటీవీ రికార్డింగ్‌ల్ని భద్రపరచాలని బ్యాంకుల్ని ఆదేశిం చింది. భారీగా కొత్త నోట్లను సమకూర్చుకున్న వారిని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ విచారణకు సహకరిస్తుందని పేర్కొంది. ‘నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకూ బ్యాంకులు, కరెన్సీ చెస్టుల కార్యకలాపాల రికార్డింగ్‌ల్ని భద్రపరచాలి’ అని పేర్కొంది.
కర్ణాటకలో ఆర్‌బీఐ అధికారి అరెస్టు
సాక్షి, బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత రూ.1.51 కోట్ల విలువైన పాత నోట్లను అక్రమంగా మార్చడానికి సాయపడ్డాడనే ఆరోపణలపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అధికారి అరెస్టయ్యాడు. కర్ణాటకలోని కొళ్లెగాళ పట్టణంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు(ఎస్‌బీఎం) శాఖలో ఆర్‌బీఐ తరఫున విధులు నిర్వర్తిస్తున్న కె.మైకేల్ అనే అధికారిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. ఇతనితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రూ.17 లక్షల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకుంది.