శ్రద్ధాంజలి
Published Fri, Dec 27 2013 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి :సముద్రం 2004 డిసెంబరు 26వ తేదీన ఒక్కసారిగా ఉప్పొంగింది. అలలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంతగా ఎగసిపడ్డాయి. లక్షలాది మందిని ఒక్క ఉదుటున తమలో కలుపుకున్నాయి. సముద్ర తీరంలో నివసించే వేల మత్స్యకార కుటుంబాలు జలసమాధి అయ్యాయి. మరెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. భారత్, శ్రీలంక, ఇండోనేషియాలోని పలు ప్రాంతాలు ఎక్కువగా సునామీ ధాటికి దెబ్బతినగా 2.30 లక్షల మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడు సముద్రతీర జిల్లాలైన చెన్నై, కడలూరు, నాగపట్నం, రామనాథపురం, కన్యాకుమారిలోని పలు ప్రాంతాలు సునామీ బారినపడ్డాయి. రాష్ట్రంలో సుమారు పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాగపట్నం జిల్లాలో అత్యధికంగా 6065 మంది ప్రాణాలు విడిచారు. చెన్నైలో 300 మంది మృత్యువాతపడ్డారు.
సముద్రంలో ఎగసి పడుతున్న అలలను తిలకించేందుకు వెళ్లిన వందలాది మంది చిన్నారులను సైతం అలలు తమలోకి లాక్కెళ్లడం కళ్లారా చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సునామీ దాడికి గురైన మత్స్యకార గ్రామాల ప్రజలు అనాటి దుర్దినాన్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చెన్నై మెరీనా తీరం వద్ద అన్నాడీఎంకే, డీఎంకే నేతలు, మత్స్యకార సంఘాల నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సముద్రంలో పాలు పోశారు. సముద్ర తీరంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. ‘సముద్రపు తల్లీ.. సముద్రపు తల్లీ.. మరోసారి మాతో కన్నీళ్లు పెట్టించకు’ అంటూ ప్రార్థించారు. నాగపట్నం జిల్లా కలెక్టరేట్‌లోని సునామీ స్మారక పార్కులో మత్స్యశాఖ మంత్రి జయపాల్, జిల్లా కలెక్టర్ మునుస్వామి శ్రద్ధాంజలి ఘటించారు. కన్యాకుమారి జిల్లాలో 199 మందిని బలి తీసుకున్న కొట్టిల్‌పోలు గ్రామంలో మౌనంగా ర్యాలీ చేపట్టారు.
Advertisement