
27న సీఎం జయలలిత బెంగళూరు రాక
- నగరంలో భారీ బందోబస్తు
- బెంగళూరు చేరుకున్న తమిళనాడు పోలీసులు
బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరు వస్తున్న సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. అక్రమ ఆస్తుల కేసులో ఆమె శనివారం బెంగళూరు వస్తున్నారు. ఈ మేరకు గురువారం నుంచి పరప్పన అగ్రహార జైలు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. ఈ కేసు విచారణ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ ఇప్పటికే పూర్తి అయ్యింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఇక్కడి పరప్పన అగ్రహార జైలు ఆవరణంలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే తమిళనాడు ఇంటెలిజెన్స్ ఐజీపీ సహా ఐపీఎస్ అధికారులు బెంగళూరు చేరుకుని ఇక్కడి పోలీసు అధికారులతో చర్చించారు. బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ (సీసీబీ) పీ. హరిశేఖర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం బుధవారం చెన్నై వెళ్లి జయ భద్రతపై అక్కడి అధికారులతో చర్చించారు.
20 వేల మంది మద్దతుదారులు వస్తారని అంచనా
బెంగళూరులో తమిళ సోదరులు లక్షల మంది ఉన్నారు. దానికి తోడు కర్ణాటక సరిహద్దులోని క్రిష్టగిరి, ధర్మపురి జిల్లాల్లోని ఆమె మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు సుమారు 20 వేల మందికిపైగా పరప్పన అగ్రహార జైలు ప్రాంతాలకు వస్తారని అధికారుల అంచనా. ఇప్పటికే కొందరు అభిమానులు లాడ్జిలను బుక్ చేసుకున్నారు. శనివారం తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.