రూ.8 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడి జిల్లాలో రూ.8 కోట్ల విలువైన రెండు టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళకూలీలపై కాల్పుల ఉదంతం తరువాత తమిళనాడులోని ఎర్ర దొంగలను పట్టుకోవడంపై దృష్టిసారించిన పోలీసులు వేలూరులో మోహనాంబాళ్‌ను రెండురోజుల కిందట అరెస్ట్ చేశారు. ఆమెకు సంబంధించిన వ్యక్తులు తమిళనాడులోనే ఎర్రచందనం దాచి ఉంచారనే అనుమానంతో తిరుపతి డీఎస్పీ రామకృష్ణ, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లతో కూడిన 50 మంది బృందం శనివారం చెన్నైకి చేరుకుంది. నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. అక్కడ వారికి ఏమీ దొరకలేదు. తూత్తుకూడి జిల్లా కొరంపాళం సమీపం మాధవనగరంలో జోసువా అనే వ్యక్తికి చెందిన గోడౌన్‌పై అక్కడి పోలీసులు దాడులు జరపగా ఒక లారీ కంటైనర్‌లో దాచి ఉంచిన రెండుటన్నుల ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుంచి తూత్తుకూడికి చేరవేసిన ఈ దుంగలను దుబాయికి తరలిచేందుకు సిద్ధం చేసి ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ దుంగల విలువ రూ.8 కోట్లుగా అంచనా వేశారు. ఈ కేసులో జోసువాతోపాటు మరొకరిని తూత్తుకూడి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
15 దుంగలు స్వాధీనం
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని మంగమ్మ బరకలు కోనేరు వద్ద నిల్వ ఉంచిన రూ.5 లక్షల విలువ చేసే 15 ఎర్రచందనం దుంగలను శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ రామ్‌సింగ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.