అమ్మ, నాన్న క్షమించండి..
► మీ కలలు నెరవేర్చలేక పోతున్నా..!
► ఇల్లు వదిలి వెళ్లిపోయిన పీయూసీ విద్యార్థిని
► లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం
బనశంకరి : ద్వితీయ పీయూసీ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో ఓ విద్యార్థిని తీవ్రమనస్తాపంతో లేఖ రాసి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన ఘటన విద్యారణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... విద్యారణ్యపురలోని పీయూ కళాశాల సైన్స్ విభాగంలో చదువుతున్న వాసవి రెండు రోజుల క్రితం విడుదలైన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గణితం మినహా అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం మార్కులు సాధించింది.
గణితంలో కేవలం 30 మార్కులు రావడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆమె తల్లిదండ్రులకు లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి విధుల నుంచి ఇంటికి చేరుకున్న వాసవి తల్లిదండ్రులు ఇంట్లో టేబుల్‌పై లేఖ చూసి ఆందోళనతో వాసవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
ఇళ్లు వదిలివెళ్లిన వాసవి తన లేఖలో తల్లిదండ్రులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేస్తూ... మీ కలలను నెరవేర్చడానికి నాకు సాధ్యం కాలేదు దయచేసి క్షమిం చండి, నా కోసం బాధపడొద్దు, మీకు న్యాయం చేయలేకపోతున్నాను, ఆత్మహత్యే నాకు శరణ్యం, లవ్యూ డ్యాడ్, అండ్ మమ్. అంటూ లేఖలో పేర్కొంది.