ఆమ్ ఆద్మీ కాదు ఖాస్ ఆద్మీ పార్టీ
Published Wed, Jan 22 2014 11:33 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ మహిళా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఆప్ సర్కార్ ఆమ్ ఆద్మీ పార్టీ కాదని ఖాస్ ఆద్మీ పార్టీగా మారిందని బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆప్ సర్కార్ విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 24న మొత్తం 14 జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడించారు. బుధవారం పండిత్‌పంత్ మార్గ్‌లోని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సహా ఆప్ మంత్రులు, ఆప్ కార్యకర్తల తీరుతో రెండు రోజులపాటు ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవినీతి కేసులు పెట్టకపోవడంతోనే కేజ్రీవాల్ సర్కార్‌కు మద్దతు కొనసాగిస్తోందని ఆరోపించారు. బీజేపీ శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించనుంది. దీనిలో ఆప్-కాంగ్రెస్ మధ్య ఉన్న చీకటి ఒప్పదం, రెండు రోజులపాటు ధర్నాతో ఆప్‌నాయకులు ప్రజలకు కలిగించిన ఇబ్బందులు ప్రధానంగా విమర్శించాలని నిర్ణయించారు. ఆప్ తన హామీల అమలులోనూ విఫలమైన తీరును ఎండగడతామని గోయల్ తెలిపారు. రిపబ్లిక్‌డే ఏర్పాట్లకు ఆటంకం కలిగించిన ఆప్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు.
Advertisement