సాక్షి,న్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను ఆమ్‌ఆద్మీ పార్టీ విడుదల చేయనున్న నేపథ్యంలో ఎవరెవ రికి టికెట్ దక్కుతుందో..ఎవరెవరికి దక్కదనే అంశాలపై ఊహాగానాలు సాగుతున్నాయి. పార్టీ టికెట్‌పై గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 9 మందికి రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంబేద్కర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అశోక్‌చౌహాన్, ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాకరించిన తిమార్‌పుర్ మాజీ ఎమ్మెల్యే హరీష్ ఖన్నా, రోహిణీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గర్గ్‌లతో పాటు మాడల్ టౌన్ మాజీ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠి, వికాస్‌పురి మాజీ ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్, సీమాపురి మాజీ ఎమ్మెల్యే ధర్మేంద్ర కోలీ,
పటేల్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వీణా ఆనంద్‌లకు ఎన్నికలలో టికెట్ ఇవ్వబోదని పార్టీ వర్గాలు అంటున్నాయి. పటేల్ నగర్ నుంచి పోటీచేయడానికి హజారీ లాల్ చౌహాన్‌కు పార్టీ ఇప్పటికే టికెట్ ఇచ్చింది. అఖిలేష్ త్రిపాఠి, మహేంద్ర యాదవ్ పార్టీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇక లక్ష్మీనగర్ నుంచి గెలిచి తిరుగుబాటు చేసి పార్టీ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ, ఇటీవల బీజేపీలో చేరిన జంగ్‌పురా మాజీ ఎమ్మెల్యే ఎం, ఎస్‌ధీర్‌లు దూరమైనట్లే.
అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త
రానున్న అసెంబ్లీ ఎన్నికలను తన ఉనికికి అత్యంత కీలకంగా పరిగణిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో తమకు దూరమైన మధ్యతరగతి ఓటర్లతో పాటు అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీ వ్యూహరచనచేస్తోంది. ఎన్నికల్లో బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం తనకు కలిసివస్తుందని భావిస్తున్న పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్‌తో విస్తృతంగా ప్రచారం చేయాలని యోచిస్తోంది. రానున్న ఎన్నికల ప్రచారం కోసం పార్టీ నేత కేజ్రీవాల్ 200 పైగా జనసభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరుగుతాయని., జనవరి ఆఖరివారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల క్రమంలో ఈ చర్చసాగుతోంది.
మాజీ ఎమ్మెల్యేలకు ఆప్ మొండిచెయ్యి
Published Thu, Dec 11 2014 1:28 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement