డీయూ ఈస్ట్ క్యాంపస్ నిర్మిస్తాం
Published Mon, Mar 31 2014 11:56 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ కేంపస్, సౌత్ కేంపస్ తరహాలో ఈస్ట్ కేంపస్‌ను ఏర్పాటు చేస్తామని, పాఠశాలలను నెలకొల్పుతామని, అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తామని, ఇంకా పలు హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలలో ఈశాన్య ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్ మేనిఫెస్టోను విడుదల చేశారు. విద్యావేత్త అయిన ఆనంద్‌కుమార్ తన మేనిఫెస్టోలో విద్యారంగానికి పెద్ద పీట వేశారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈస్ట్ కేంపస్ ఏర్పాట య్యేందుకు తాను అవ సరమైన అన్ని చర్యలు చేపడ్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. సెంట్రల్ స్కూల్స్, నవోదయ విద్యాలయను నెలకొల్పడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కొత్త ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు నెలకొల్పడానికి ఢిల్లీ సర్కారు, ఎమ్సీడీలతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో విద్యా సదుపాయలను అభివృద్ధి చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని కనబరిచాయని ఆయన ఆరోపించారు. ముస్తఫాబాద్‌లో బాలికల కోసం ఉన్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల శిథిలావస్థలో ఉందని ఆయన మండిపడ్డారు. ఈ స్కూల్లో పిల్లలను బృందాలుగా విభజించి, పిల్లలతోనే క్లాసులు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశరాజధానిలోనే విద్యావ్యవస్థ ఇంత ఘోరంగా ఉండటం ఊహించశక్యంగా లేదని ఆయన అన్నారు. ఈశాన్య ఢిల్లీలో అపరిశుభ్రతపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నార్త్ ఈస్ట్ ఢిల్లీ వాసుల కన్నా నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో మురికి ఎక్కువగా పేరుపొందిందని ఆయన అన్నారు, బ్రహ్మపురి, గోకల్‌పురి మురికికాలువల కోసం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ అవి ఇంకా ఓపెన్‌గానే ప్రవహిస్తూ దోమల పెంపకానికి నెలవులుగా మారాయని ఆయన ఆరోపించారు. డెంగీతో మరణించేవారి సంఖ్య ఈశాన్య ఢిల్లీలోనే అధికంగా ఉందని చెప్పారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థాయిలో నియోజకవర్గాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయగా, ఎమ్సీడీ స్థాయిలో బీజేపీ నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ఈశాన్య జిల్లా అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ నిరాదరణకు లోనైందని ఆనంద్‌కుమార్ విమర్శించారు. ఇక్కడి ప్రజలు తాము మోసానికి, నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావనతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని, అయినా ఢిలీ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
Advertisement