లోక్‌సభ ఎన్నికల తర్వాత అప్పటిదాకా బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ హర్షవర్ధన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవి వరించింది. దీంతో బాధ్యతల నిర్వహణలో ఆయన తలమునకలైపోయారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు. ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సారథి కోసం ఎదురుచూస్తున్నారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు నూతన సారథి ఎవరనే విషయంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. శాసనసభ ఎన్నికలు ఏ సమయంలోనైనా జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో కచ్చితంగా వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికలకు సన్నద్ధమవడం సులభమవుతుందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల పరాజయం తర్వాత పూర్వవైభవం కోసం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు నగరంలో తమ పట్టును పెంచుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రమిస్తోంది.
బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతల్లో డాక్టర్ హర ్షవర్ధన్ తలమునకలయ్యారని, అందువల్ల రాష్ట్ర శాఖ వ్యవహారాలపై ఆయన అంతగా దృష్టి సారించలేరని ఆ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ హర ్షవర్ధన్ తన పనిలో తాను నిమగ్నమయ్యారన్నారు. అందువల్ల పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించడానికి అంత సమయం ఆయనకు ఉండదన్నారు. దీంతో ఎటువంటి భారీ కార్యక్రమాన్ని చేపట్టలేని పరిస్థితి కొనసాగుతోందన్నారు.
కనీసం సభ్యత్వ కార్యక్రమం కూడా చేపట్టలేకపోతున్నామన్నారు. బీజేపీ సాధారణంగా ఆరు సంవత్సరాలకొకసారి సభ్యత్వ కార్యక్రమం చేపడుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఈసారి ఐదు సంవత్సరాలకే నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెలాఖరుదాకా కొనసాగనుంది. అయితే తొలి నాలుగు రోజుల్లో ఆశించిన మేర స్పందన రాలేదు. ఇది ఆ పార్టీని కొంత నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్ర శాఖకు సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని ఆ పార్టీ నాయకుడొకరు వాపోయారు. మరోవైపు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు యత్నిస్తున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజూ మొహల్లా సభలను నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి విద్యుత్ సంక్షోభం అనుకోని అవకాశంగా మారింది. ఈ సమస్యపై ప్రతిరోజూ ఆందోళనలకు దిగడం ద్వారా ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు యత్నిస్తోంది. తద్వారా శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నానాతంటాలు పడుతోంది. మరోవైపు ఈ సంక్షోభం బీజేపీకి శాపంగా పరిణమించింది. సరైన నాయకత్వం లేకపోవడంతో ఈ సమస్యపై తమ వైఖరేమిటనే విషయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించలేని పరిస్థితి కొనసాగుతోంది. చివరికి ఈ-రిక్షాల విషయంలో కూడా వారు పెదవి విప్పలేకపోతున్నారు. ఇందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు నితిన్ గడ్కరీ వీటి క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే. ఒకవేళ ఎన్నికలు ముంచుకొస్తే ఆప్‌కు గట్టి పట్టు కలిగిన ప్రాంతాల్లో బీజేపీ తన ప్రచార పర్వాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ-రిక్షాలకు క్రమబద్ధీకరణకు సంబంధించి స్పష్టమైన హామీ లభించినట్టయితే దానిద్వారా బీజేపీ ఆ వర్గాల మద్దతు పొందే అవకాశం లభిస్తుంది. అందుకోసం కూడా విస్తృత మైన ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది.
ఎన్నికలకు మేం సిద్ధంగానే ఉన్నాం: బీజేపీ నేత రమేశ్
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఒకవైపు అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమ పార్టీ ఎన్నికలకు సన్నద్ధంగానే ఉందని బీజేపీ నాయకుడు రమేశ్ బిధూరీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలొక్కటే తమకు మిగిలి ఉన్న అవకాశమన్నారు. ‘ఎన్నికలకు మా పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఈసారి మాకు తిరుగులేని మెజారిటీ వస్తుందనే ధీమా ఉంది’ అని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈ దక్షిణ ఢిల్లీ ఎంపీ పేర్కొన్నారు. ఎన్నికలకు మీ పార్టీ సిద్ధమేనా అని ప్రశ్నించగా ఈ విషయమై అధిష్టానం త్వరలో ఓ నిర్ణయానికి వస్తుందన్నారు.
భారీ పగటికలలు కంటూ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ 49 రోజుల పాలనాకాలంలో దాని లోపాలన్నీ బయటపడ్డాయన్నారు. అందువల్లనే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఇబ్బందికరమైన ఫలితాలను చవిచూడక తప్పలేదన్నారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నగరంలోని మొత్తం 70 సెగ్మెంట్లకు గాను 60 స్థానాల్లో బీజేపీ ముందున్న సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికలకు ముందు డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాని సంగతి విదితమే. ఆ ఎన్నికల్లో బీజేపీకి 33.07 శాతం ఓట్లు రాగా ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 46.10 శాతానికి పెరిగింది. ఇక ఆప్ ఓటు శాతం 32.90 నుంచి 29.49 శాతానికి పడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 24.50 శాతం వాటా దక్కింది. ఇది లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి 15.10 శాతానికి పడిపోయింది. వాస్తవానికి ప్రస్తుతం ఎన్నికల బరిలోకి దిగడం ఏ పార్టీకీ ఇష్టం లేకపోయినప్పటికీ అంతకుమించి మరో మార్గం కనిపించని పరిస్థితి కొనసాగుతోంది.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ ఇంకెన్నాళ్లో?
Published Sun, Jun 22 2014 10:52 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement