Dr Harsha Vardhan
-
‘వ్యాక్సిన్’ స్పెషలిస్ట్.. నాడు, నేడు ఆయనదే కీలక పాత్ర
దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైన పక్షం రోజుల్లోనే 35 లక్షల మందికి వ్యాక్సిన్ అందింది. అగ్రరాజ్యం అమెరికా మొదలు యూకే వరకు నేటికీ కోవిడ్ కోరల్లో చిక్కి విలవిల్లాడుతుంటే భారత్ మాత్రం సురక్షితమైన, చవకైన టీకాను ప్రపంచం ముందుకు తేవడమే కాకుండా పేద దేశాలకు ఉచితంగా లక్షల డోసులు అందించి స్నేహ హస్తం చాచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి మొదలు ఎన్నో దేశాలు మన ఘనతను పొగుడుతున్నాయి. దీని వెనుక ఓ వ్యక్తి నిరంతర శ్రమ దాగి ఉంది. ►‘నిండు జీవితానికి రెండే చుక్కలు’.. పల్స్ పోలియో కార్యక్రమ నినాదం ఇది. ఆ రెండు చుక్కలే మన దేశం నుంచి పోలియోను తరిమేశాయి. ►ఈ విజయగాథ వెనుక ఓ వ్యక్తి పట్టుదల ఉంది. ఈ రెండు క్లిష్ట పరిస్థితుల్లోనూ వైరస్‌లపై పోరును వెనుక నుంచి నడిపించిన వ్యక్తి ఒక్కరే.. ఆయనే డాక్టర్ హర్షవర్ధన్. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి. అందుకే కరోనా టీకా పంపిణీ ప్రణాళిక అమలు బాధ్యతను ప్రధాని మోదీ ఆయన భుజాలపై పెట్టారు. హర్షవర్ధన్‌పై మోదీకి నమ్మకం కుదరడానికి కారణం ఆ ‘రెండు చుక్కల’ విజయగాథే. సాక్షి, హైదరాబాద్: అది 1988 సంవత్సరం. దేశంలో సగటున నిత్యం 450 మంది చిన్నారులు పోలియో బారిన పడుతున్న సమయం. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సైతం భారత్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కాలం. భారత్‌లో ఐదేళ్లలోపు వయసున్న దాదాపు 17 కోట్ల మంది పిల్లలు పోలియో బారిన పడకుండా కాపాడటం సాధ్యం కాదేమోనని, ప్రపంచంలో పోలియోను నిర్మూలించే చిట్టచివరి దేశం భారతే కావచ్చేమోనని అనుమాన పడిన సందర్భం. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ పోలియోను అరికట్టగలిగింది. భారత్‌ను పోలియోరహిత దేశం గా 2014లో మార్చి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 1988–2011 మధ్య ఆ మార్పు ఎలా వచ్చింది? ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఈ అద్భుతం ఎలా జరిగింది? ఒక్కడి ఆలోచనతో ముందడుగు దేశంలో 1994 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పోలియో కేసుల్లో 60 శాతం మన దేశంలోనే వెలుగుచూసేవి. ఐరోపా దేశాలు క్రమంగా పోలియో నుంచి విముక్తి పొందుతుండగా భారత్‌లో మాత్రం పోలియో నిర్మూలన దాదాపు అసాధ్యమన్న తరహాలో పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా అదే సమయంలో అప్పటి కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీతోపాటు ఐదు రాష్ట్రాల్లో ఆగస్టు–అక్టోబర్ మధ్య ప్లేగు వ్యాధి సైతం ప్రబలింది. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీ వైద్య మంత్రిగా డాక్టర్ హర్షవర్ధన్ బాధ్యతలు చేపట్టారు. వెంటనే కార్యక్షేత్రంలోకి దిగిన ఆయన పోలియో నిర్మూలన కోసం ఢిల్లీలో తొలిసారి సామూహిక పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు గాంధీ జయంతిగా జరుపుకొనే అక్టోబర్ 2ను ముహూర్తంగా ఖరారు చేశారు. అయితే ఈ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పెదవి విరిచింది. ఈ ప్రయోగం ఆశించినంత విజయవంతం కాదని, ప్లేగు వ్యాధి ప్రబలుతున్నందున మరికొంత సమయం తీసుకొని కొత్త తేదీని నిర్ణయించాలని సూచించింది. కానీ హర్షవర్ధన్ పట్టు వీడలేదు. స్కూలు పిల్లలకు వినూత్న హోంవర్క్... ఈ కార్యక్రమం అమలు కోసం డాక్టర్ హర్షవర్ధన్ ఢిల్లీలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఓ వినూత్న హోం వర్క్ అప్పగించారు. ఒక్కో విద్యార్థి తన ఇంటి పరిసరాల్లో ఐదేళ్లలోపు ఉన్న 10 మంది చిన్నారుల వివరాలు సేకరించి ఉపాధ్యాయులకు అప్పగించడంతోపాటు ఆ పిల్లలను వారి తల్లిదండ్రులు పోలియో కేంద్రాలకు తీసుకొచ్చేలా చైతన్యపరచే బాధ్యత అప్పగించారు. అధికారుల ద్వారా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల ద్వారా పాఠశాల పిల్లలకు ఈ సమాచారం చేరింది. సెప్టెంబర్ 30కల్లా వివరాలు అందించాలన్నది హోంవర్క్. నిర్దేశించిన తేదీకన్నా ముందే ఢిల్లీ విద్యార్థులు ఉత్సాహంగా వివరాలు సేకరించి అందించారు. అంతే.. అక్టోబర్ 2న ఢిల్లీవ్యాప్తంగా ఒకేరోజు ఏకంగా 12 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు పడ్డాయి. ఇది ప్రపంచ రికార్డుగా నిలిచింది. దీన్ని గుర్తించిన నాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అంతూలే ఇదే నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. సరిగ్గా మరుసటి సంవత్సరం జాతీయ స్థాయి పల్స్ పోలియో రోజున ఢిల్లీ నమూనా అమలైంది. ఒకేరోజు 8.8 కోట్ల మందికి పోలియో వ్యాక్సిన్ అందింది. నాటి నుంచి ఏటా పల్స్ పోలియో కార్యక్రమం అమలవుతోంది. ఈ సంవత్సరంతో నైజీరియా లాంటి దేశాలు పోలియోరహితంగా మారగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ లాంటి దేశాలు పోలియోతో ఇంకా పోరాడుతున్నాయి. 135 కోట్ల జనాభాతో కిటకిటలాడుతున్న మన దేశం పోలియోను తరిమికొట్టగలిగింది. ఇండియాలో ఇప్పట్లో పోలియో పోదు అని అంచనా వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చివరకు ఆశ్చర్యపోయి డాక్టర్ హర్షవర్ధన్‌ను ‘పోలియో ఇరాడికేషన్ చాంపియన్’గా అభివర్ణించింది. తలుచుకుంటే అద్భుతం మన చేతిలోనే... మనపై మనకు చిన్నచూపు ఉంటుంది. కానీ, తలచుకుంటే అద్భుతాలు చేయగలం. కరోనా టీకా విషయంలో మనం విజయం సాధించాం. కానీ,అంతకుముందు పోలియో విషయంలో అద్భుతమే జరిగింది. ఆ అబ్బాయి మొహం నాకు ఇంకా గుర్తుంది. చుట్టుపక్కల 10 మంది ఐదేళ్లలోపు పిల్లల వివరాలు తీసుకురావాలని హోంవర్క్ ఇస్తే అతను ఏకంగా 346 మంది పేర్లు తెచ్చాడు. అలాంటి వారి కృషితోనే ఆ ఘనత సాధ్యమైంది – ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ హర్షవర్ధన్ -
కీలక దశలో కరోనా వ్యాక్సిన్లు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో అభివృద్ధి చేస్తున్న 14 కరోనా వ్యాక్సిన్లలో 4 వ్యాక్సిన్లు అతిత్వరలో క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావుతో ఆయన చేపట్టిన సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో ఈ వివరాలు తెలిపారు. ఐదు నెలల్లో భారత్‌లో నాలుగు కరోనా వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకుంటాయని చెప్పారు. కోవిడ్-19కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయని, దాదాపు 100కు పైగా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ రూపకల్పన ప్రయత్నాలను సమన్వయపరుస్తోందని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశంలో 6767 తాజా కేసులు వెలుగుచూడగా 147 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో 1,31,920కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చదవండి : వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్లు -
‘కరోనా’ పై కొత్త చాలెంజ్.. భారీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఇప్పటి వరకు రకరకాల చాలెంజ్‌లను చూశాం. ఐస్ బకెట్ చాలెంజ్, ఫిట్నెస్, గ్రీన్ ఇండియా చాలెంజ్.. ఇలా పలు రకాల చాలెంజ్‌లను సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు ఇతరులకు విసిరారు. వారంతా ఆ చాలెంజ్‌ని స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసిరారు. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రారంభించింది. కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నవేళ.. దానిని అడ్డుకునేందుకు డబ్ల్యూహెచ్ఓ ‘ సేఫ్ హ్యాండ్స్ (#SafeHands) ’ చాలెంజ్‌ను తెరమీదకు తెచ్చింది. ఈ నెల 13 న డబ్య్లూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయెసస్ ‘సేఫ్ హ్యాండ్స్’ అనే సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించారు. ట్విటర్ లో తన చేతులు శుభ్రపరుచుకుంటున్న వీడియోని షేర్ చేశారు. చేతులను సబ్బుతో కానీ, ఆల్కహాల్ తో గానీ శుభ్రం చేసుకోవాలని చెబుతూ.. మొత్తం 11 స్టెప్స్ ఫాలో అవ్వాలని వీడియోలో చూపారు. తన ఫాలోవర్స్ తో పాటుగా కొందరి ప్రముఖులను(క్రీడాకారులు, సినీ నటులు) కూడా ఇలాగే తమ వీడియోలను తీసి షేర్ చేయాలని ఛాలెంజ్ చేశారు. (చదవండి : కోహ్లి, సానియాకు చాలెంజ్ విసిరిన సింధు) हम सभी कोरोना वायरस (COVID-19) की वजह से चिंतित है। इस वायरस को फैलने से रोकने के लिए जो एक आसान सी चीज़ हम कर सकते है वो है अपने हाथों को स्वच्छ रखना। हाथों को 20 सेकंड तक साबुन के साथ धोना अनिवार्य है। हमेशा अपने हाथों को अच्छे से धोएं।#SafeHandsChallenge @UNICEF @WHO pic.twitter.com/63zE8OIvY3 — Sachin Tendulkar (@sachin_rt) March 17, 2020 డబ్ల్యూహెచ్ఓ విసిరిన చాలెంజ్‌కు భారత్‌లో మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ చాలెంజ్‌ను పలువురు క్రీడాకారులు, సినీనటులు స్వీకరించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణే, అనుష్క శర్మ తదితరులు 'సేఫ్ హ్యాండ్స్' చాలెంజ్‌ను స్వీకరించి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకొని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ‘సేఫ్ హ్యాండ్స్’ చాలెంజ్‌ను స్వీకరించారు. చేతులను సబ్బుతో శుభ్రం చేసుకొని, ఆ వీడియోను ట్వీటర్లో పోస్ట్ చేశారు. పౌరులంతా ‘ సేఫ్ హ్యాండ్స్’ చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకొని కరోనావైరస్ను హతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తన ‘సేఫ్ హ్యాండ్స్’ చాలెంజ్‌ను పార్లమెంబ్ సభ్యులందరికి విసిరారు. ఎంపీలంతా చేతును శుభ్రం చేసుకొని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. (కరోనా : ఫేస్బుక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ) కాగా, కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, దాదాపు 8000 మంది మరణించారు. పాకిస్తాన్లో 212 కేసులు నమోదు కాగా బుధవారం తొలి మరణం నమోదైంది. వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఇరాన్లో కరోనా కేసుల సంఖ్య 988కి పెరగ్గా 135 మంది మరణించారు. స్సెయిన్లో తాజాగా 2000 కొత్త కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్ కేసుట సంఖ్య ఏకంగా 11,000కు ఎగబాకింది. ఇక భారత్‌లో 147 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. తెలంగాణ ఆరుగురికి కరోనావైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కేసు నమోదైంది. I request all citizens to take the #SafeHands challenge & POST THEIR VIDEOS HERE to help create mass awareness ! Washing hands thoroughly with soap & water kills #coronavirus ! A big shout out to all Members of Parliament to take the #SafeHandsChallenge & post their videos ! pic.twitter.com/JmYae2H6bB — Dr Harsh Vardhan (@drharshvardhan) March 17, 2020 -
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ ఇంకెన్నాళ్లో?
లోక్‌సభ ఎన్నికల తర్వాత అప్పటిదాకా బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ హర్షవర్ధన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవి వరించింది. దీంతో బాధ్యతల నిర్వహణలో ఆయన తలమునకలైపోయారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు. ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సారథి కోసం ఎదురుచూస్తున్నారు. న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు నూతన సారథి ఎవరనే విషయంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. శాసనసభ ఎన్నికలు ఏ సమయంలోనైనా జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో కచ్చితంగా వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికలకు సన్నద్ధమవడం సులభమవుతుందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల పరాజయం తర్వాత పూర్వవైభవం కోసం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు నగరంలో తమ పట్టును పెంచుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రమిస్తోంది. బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతల్లో డాక్టర్ హర ్షవర్ధన్ తలమునకలయ్యారని, అందువల్ల రాష్ట్ర శాఖ వ్యవహారాలపై ఆయన అంతగా దృష్టి సారించలేరని ఆ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ హర ్షవర్ధన్ తన పనిలో తాను నిమగ్నమయ్యారన్నారు. అందువల్ల పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించడానికి అంత సమయం ఆయనకు ఉండదన్నారు. దీంతో ఎటువంటి భారీ కార్యక్రమాన్ని చేపట్టలేని పరిస్థితి కొనసాగుతోందన్నారు. కనీసం సభ్యత్వ కార్యక్రమం కూడా చేపట్టలేకపోతున్నామన్నారు. బీజేపీ సాధారణంగా ఆరు సంవత్సరాలకొకసారి సభ్యత్వ కార్యక్రమం చేపడుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఈసారి ఐదు సంవత్సరాలకే నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెలాఖరుదాకా కొనసాగనుంది. అయితే తొలి నాలుగు రోజుల్లో ఆశించిన మేర స్పందన రాలేదు. ఇది ఆ పార్టీని కొంత నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్ర శాఖకు సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని ఆ పార్టీ నాయకుడొకరు వాపోయారు. మరోవైపు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు యత్నిస్తున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజూ మొహల్లా సభలను నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి విద్యుత్ సంక్షోభం అనుకోని అవకాశంగా మారింది. ఈ సమస్యపై ప్రతిరోజూ ఆందోళనలకు దిగడం ద్వారా ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు యత్నిస్తోంది. తద్వారా శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నానాతంటాలు పడుతోంది. మరోవైపు ఈ సంక్షోభం బీజేపీకి శాపంగా పరిణమించింది. సరైన నాయకత్వం లేకపోవడంతో ఈ సమస్యపై తమ వైఖరేమిటనే విషయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించలేని పరిస్థితి కొనసాగుతోంది. చివరికి ఈ-రిక్షాల విషయంలో కూడా వారు పెదవి విప్పలేకపోతున్నారు. ఇందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు నితిన్ గడ్కరీ వీటి క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే. ఒకవేళ ఎన్నికలు ముంచుకొస్తే ఆప్‌కు గట్టి పట్టు కలిగిన ప్రాంతాల్లో బీజేపీ తన ప్రచార పర్వాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ-రిక్షాలకు క్రమబద్ధీకరణకు సంబంధించి స్పష్టమైన హామీ లభించినట్టయితే దానిద్వారా బీజేపీ ఆ వర్గాల మద్దతు పొందే అవకాశం లభిస్తుంది. అందుకోసం కూడా విస్తృత మైన ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు మేం సిద్ధంగానే ఉన్నాం: బీజేపీ నేత రమేశ్ న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఒకవైపు అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమ పార్టీ ఎన్నికలకు సన్నద్ధంగానే ఉందని బీజేపీ నాయకుడు రమేశ్ బిధూరీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలొక్కటే తమకు మిగిలి ఉన్న అవకాశమన్నారు. ‘ఎన్నికలకు మా పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఈసారి మాకు తిరుగులేని మెజారిటీ వస్తుందనే ధీమా ఉంది’ అని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈ దక్షిణ ఢిల్లీ ఎంపీ పేర్కొన్నారు. ఎన్నికలకు మీ పార్టీ సిద్ధమేనా అని ప్రశ్నించగా ఈ విషయమై అధిష్టానం త్వరలో ఓ నిర్ణయానికి వస్తుందన్నారు. భారీ పగటికలలు కంటూ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ 49 రోజుల పాలనాకాలంలో దాని లోపాలన్నీ బయటపడ్డాయన్నారు. అందువల్లనే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఇబ్బందికరమైన ఫలితాలను చవిచూడక తప్పలేదన్నారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నగరంలోని మొత్తం 70 సెగ్మెంట్లకు గాను 60 స్థానాల్లో బీజేపీ ముందున్న సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికలకు ముందు డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాని సంగతి విదితమే. ఆ ఎన్నికల్లో బీజేపీకి 33.07 శాతం ఓట్లు రాగా ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 46.10 శాతానికి పెరిగింది. ఇక ఆప్ ఓటు శాతం 32.90 నుంచి 29.49 శాతానికి పడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 24.50 శాతం వాటా దక్కింది. ఇది లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి 15.10 శాతానికి పడిపోయింది. వాస్తవానికి ప్రస్తుతం ఎన్నికల బరిలోకి దిగడం ఏ పార్టీకీ ఇష్టం లేకపోయినప్పటికీ అంతకుమించి మరో మార్గం కనిపించని పరిస్థితి కొనసాగుతోంది.