
ఆప్ నాయకత్వంలో చీలిక!
ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి.
- అగ్రనేతల్లో భేదాభిప్రాయాలు.. రెండు గ్రూపుల వృద్ధి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. పార్టీలో అంతర్గతంగా అనేక విభేదాలు తలెత్తినట్లు ఆప్ అంతర్గత లోక్‌పాల్ కమిటీ తాజాగా పార్టీ నాయకత్వానికి రాసిన లేఖతో వెలుగుచూసింది. పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడుతున్న విషయాన్ని ఎత్తిచూపింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యంపై వస్తున్న విమర్శలకు పరిష్కారం చూపాల్సి ఉందని సూచించింది. ‘ఒక్కరికి ఒక్క పదవి’ విధానాన్ని అవలంబించాలంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆప్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న లోక్‌పాల్ కమిటీ ఇటీవలి పార్టీ జాతీయ కార్యవర్గ భేటీకి ముందే ఆప్ రాజకీయ సలహా కమిటీకి లేఖ రాసింది.
6నెలలుగా పార్టీలో రెండు గ్రూపులు వృద్ధి చెందుతున్నాయని, అగ్రనాయకత్వంలో పరస్పర విశ్వసనీయత లోపించడం వల్ల అనవసర వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయంది. ఢిల్లీ సీఎంగా, పార్టీ జాతీయ కన్వీనర్‌గా రెండు పదవుల్లో కేజ్రీవాల్ కొనసాగడంపై కొందరు నేతలు ఇటీవల అభ్యంతరం తెలపడంతో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. అయితే పార్టీ నేతలు నిలువరించారు.