దోవల్.. ది మాస్టర్ మైండ్! | About NSA Ajit Doval, India's Top Spy Master | Sakshi
Sakshi News home page

దోవల్.. ది మాస్టర్ మైండ్!

Published Sat, Oct 1 2016 3:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

దోవల్.. ది మాస్టర్ మైండ్!

దోవల్.. ది మాస్టర్ మైండ్!

ఆర్మీ దూకుడు వెనుక జాతీయ భద్రతా సలహాదారు
ఒక్క పాక్ బుల్లెట్‌కు రెండు బుల్లెట్లతో బదులివ్వండి

 న్యూఢిల్లీ: ‘శాంతి.. సహనం.. వ్యూహాత్మక మౌనం..’ సరిహద్దుల వెంట పాక్ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నా భారత్ ఇన్నాళ్లూ జపించిన మంత్రాలివీ! కానీ వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టి గురువారం బెబ్బులిలా విరుచుకుపడింది. పీవోకేలోకి వెళ్లి ఉగ్రమూకల పీచ మణిచింది. అడ్డొచ్చిన ఇద్దరు పాక్ సైనికులనూ మట్టికరిపించింది! దీంతో ఇన్నాళ్లూ రక్షణాత్మక ధోరణిని అవలంబించిన భారత్ ఎదురుదాడి వ్యూహానికి పదును పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యూహానికి బీజాలు ఇప్పుడు కాదు.. రెండేళ్ల కిందటే పడ్డాయి!! దీనంతటి వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలకపాత్ర పోషించారు.

‘పాక్ ఒక్క బుల్లెట్ పేలిస్తే మీరు రెండు బుల్లెట్లతో సమాధానం చెప్పండి’ అంటూ రెండేళ్ల కిందటే అజిత్ దోవల్ సైన్యానికి స్పష్టంచేశారు. పాక్ ఏమాత్రం కవ్వించినా తగిన విధంగా బుద్ధి చె ప్పాలని, దీటుగా స్పందించాలని సూచించారు. కాల్పుల విషయంలో పై నుంచి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా అప్పటికప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. 2014 అక్టోబర్ 7న బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్‌తో జరిగిన సమావేశంలో దోవల్ ఈ మేరకు పేర్కొన్నారు.

‘అటు వైపు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే.. మీరు రెండు బుల్లెట్లతో బదులివ్వండి..’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది. పాక్ రేంజర్లు కాల్పులు ఆపేంత వరకు ఒక క్రమ పద్ధతి ప్రకారం సరిహద్దుల వెంట వారి మౌలిక వసతులను టార్గెట్ చేసుకొని విరుచుకుపడాలని ఆ భేటీలో చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పాక్ సైన్యంతో ఎలాంటి సమావేశాలు జరపకూడదని కూడా నిర్దేశించారు. అప్పట్నుంచి సరిహద్దుల వెంట పాక్ చిన్న కవ్వింపు చర్యకు పాల్పడ్డా.. భారత సైన్యం విరుచుకుపడింది. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ సైన్యం ఇలా దూకుడుగా వ్యవహరించడంతో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు భారీ నష్టమే మిగిలింది.

 కాల్పులు ఆపండి.. ప్లీజ్!
కిందటి అక్టోబర్‌లో పాకిస్తాన్ రేంజర్స్(పంజాబ్) డెరైక్టర్ జనరల్ ఉమర్ ఫరూక్ బుర్కీ చర్చల కోసం ఢిల్లీకి వచ్చిన సమయంలో కూడా సరిహద్దుల వెంట పాక్ సైన్యం రెచ్చిపోయింది. బుర్కీ పాక్‌కు తిరిగి వెళ్లాక కూడా పెద్దఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఏమాత్రం తగ్గకుండా గట్టిగా బదులివ్వాలని దోవల్, హోంమంత్రి రాజ్‌నాథ్ బీఎస్‌ఎఫ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మన సైన్యం ధాటికి పాక్ వైపు 26 మంది మరణించారు. దీంతో బుర్కీ... బీఎస్‌ఎఫ్ చీఫ్ డీకే పాఠక్‌ను ‘హాట్‌లైన్’ ద్వారా సంప్రదించి కాల్పులు ఆపాల్సిందిగా విన్నవించినట్లు తెలిసింది.

గత జూలైలో భారత ఆర్మీ.. మియన్మార్ భూభాగంలోకి చొచ్చుకువెళ్లి తీవ్రవాదులను మట్టుబెట్టడం వెనుక కూడా దోవలే కీలక పాత్ర పోషించారు. మొత్తమ్మీద గత రెండేళ్లలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు.. ఇటు ఆర్మీలో స్థైర్యాన్ని పెంచగా అటు తమతో పెట్టుకుంటే భారీగా నష్టపోక తప్పదన్న స్పష్టమైన సంకేతాన్ని పాక్‌కు అందించింది. గురువారం కూడా పీవోకేలో మన కమెండోలు సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చిన తర్వాత పాక్ బలగాలు రాజౌరీ, బారాముల్లాలోని బీఎస్‌ఎఫ్ పోస్టుల వైపు కాల్పులు జరిపాయి. ‘బహుశా అసహనంతోనే పాకిస్తాన్ ఈ చర్యకు పాల్పడి ఉంటుంది. ఆ కాల్పులను కూడా మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది’ అని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement