బాగేపల్లి : తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ బాలిక వ్యభిచార కూపంలో చిక్కి నరకయాతన అనుభవించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడినుంచి తప్పించుకొని బస్సు కండక్టర్ ద్వారా తల్లి ఒడికి చేరిన ఆ బాలిక విషాద గాథ ఇది. ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న కర్ణాటకలోని బాగేపల్లి పోలీసులు చిన్నారితో వ్యభిచారం చేయిస్తున్న మహిళలతో పాటు అమ్మాయిలను రవాణా చేస్తున్న తిరుపతికి చెందిన వ్యక్తిని మంగళవారం కోర్టులోహాజరుపరిచారు.
వివరాల్లోకి వెళ్తే... 15 రోజుల క్రితం తెలంగాణలోని మహాబూబ్ నగర్ జిల్లా, యనగొండ గ్రామానికి చెందిన బాలిక (15) ఇంటి నుంచి పారిపోయి రైలులో చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకుంది. తిరుపతికి చెందిన సునీల్ అనే వ్యక్తి పని కల్పిస్తానని మాయమాటలు చెప్పి బాలికను బాగేపల్లికి తీసుకువచ్చాడు. అక్కడ ఒకటో వార్డులో ఉంటున్న లత అనే మహిళ వద్దకు విడిచి వెళ్లిపోయాడు. ఆమె బాలికతో వ్యభిచారం చేయిస్తూ చిత్రహింసలకు గురిచేసేది.
ఈ క్రమంలో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని చింతామణి వైపు వెళ్లే బస్సు ఎక్కింది. కండెక్టర్ టికెట్ కోసం డబ్బు అడగ్గా తన వద్ద లేవని అసలు విషయం వెల్లడించింది. దీంతో కండెక్టర్ బాలికను తన ఇంటికి తీసుకుపోయాడు. అనంతరం బాలిక తల్లికి సమాచారం ఇచ్చాడు. ఆమె బాగేపల్లికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లత ఇంటిపై దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో సునీల్ అనే వ్యక్తి బాలికను ఇక్కడకు పంపినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు తిరుపతికి వెళ్లి సునీల్‌ను అరెస్ట్ చేసి నిందితులిద్దరిని కోర్టుకు హాజరు పరిచారు.