మొయినాబాద్: వారాంతపు విడిదిలు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. వీకెండ్‌లో సరదాగా గడపడానికంటూ నగర శివారు ప్రాంతాల్లో నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టురట్టు చేస్తున్నా మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఫాంహౌస్‌లను లీజ్‌కు తీసుకుని వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటికి ఆకర్షితులై యువత పెడదారి పడుతుంది.
హైదరాబాద్ శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది బడాబాబులు ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్‌పల్లి, శంషాబాద్ మండలాల్లో ఫాంహౌస్‌లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్‌లున్నాయి. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి 1 ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్‌లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఫాంహౌస్‌లు నిర్మించుకుని తర్వాత వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు.
నిర్వాహకుల అడ్డగోలు దందా..
ఫాంహౌస్‌లను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్ టూ గెదర్ పారీ్టలు, ఫ్యామిలీ పారీ్టలు, బర్త్‌డేలంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. ఫాంహౌస్‌లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఫాంహౌస్‌లలో ఉంచుతున్నారు. అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దింపి యువకుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, చాకలిగూడ, సురంగల్, శ్రీరాంనగర్, తోలుకట్ట, ఎత్‌బార్‌పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, ఎనికేపల్లి, అజీజ్‌నగర్, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఫాంహౌస్‌లలో ఈ దందాలు జోరుగా కొనసాగుతున్నాయి.
నిఘా వైఫల్యం!
ఫాంహౌస్‌ల్లో జరుగుతున్న వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని తెలుస్తుంది. ఫాంహౌస్‌లపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్వాహకులతో మిలాకత్ అవుతున్నట్లు సమాచారం. అందుకే ఫాంహౌస్‌ల్లో రాత్రిపూట ఎంత హంగామా జరిగినా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎలుకగూడ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహించడం వల్ల యువకుల మధ్య జరిగిన గొడవలు ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసినట్లు సమాచారం. అప్పడప్పుడు ఫాంహౌస్‌లపై జరుగుతున్న దాడులు ఎస్‌ఓటీ పోలీసులు చేస్తున్నవే కావడం విశేషం.
వరుస ఘటనలు...
మొయినాబాద్ మండలంలోని ఫాంహౌస్‌ల్లో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు నెలల క్రితం కనకమామిడి రెవెన్యూలోని మ్యాంగోహుడ్ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా గురువారం రాత్రి కనకమామిడి రెవెన్యూ పరిధిలోని హ్యాపీహోంస్‌లో ఉన్న రాజు ఫాంహౌస్‌పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ఓ వాచ్‌మెన్, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై సైతం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment