
నిజ జీవితంలో.. నటించడం చేతకాదు
* ప్రజలతోనే నా పయనం
* ఆ ఇద్దర్నీ బహిష్కరిద్దాం
* విద్యుత్ చార్జీల పెంపుపై డీఎండీకే ఆందోళన
* మదురైలో గళమిప్పిన విజయకాంత్
సాక్షి, చెన్నై: ‘నిజ జీవితంలో నటించడం చేత కాదు’ అని డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. ప్రజలతోనే తన పయనం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మదురైలో శుక్రవారం జరిగిన విద్యుత్ చార్జీల పెంపు నిరసనలో డీఎంకే, అన్నాడీఎంకేలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనకు డీఎండీకే పిలుపు నిచ్చింది. పార్టీ వర్గాలు ఆయా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారుు. మదురై వేదికగా జరిగిన సభలో విజయకాంత్ పాల్గొన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నిరసనకు తరలి వచ్చారు.
విజయకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. జైలు శిక్షపడ్డ జయలలిత ఏమో ప్రజా సీఎం....ప్రజా సీఎం అని పిలుస్తున్నారని, అలాంటప్పుడు పన్నీరు సెల్వం ఎవరికి సీఎం అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలకు మార్చిమార్చి అధికార పగ్గాలు అప్పగించడం వలన ప్రజలకు ఒరిగింది శూన్యమేనన్నారు. ప్రజల్లో మార్పు రావాలని పిలుపు నిచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలో అవినీతిలో దొందుదొందేనని, ఆ రెండు పార్టీలను బహిష్కరించే తీర్పును రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నటన చేత కాదు
తాను సినిమాల్లో నటించగలనే గానీ, వాస్తవిక జీవితంలో నటన చేత కాదన్నారు. పార్టీ పరంగా తాను అందిస్తున్న సేవల్ని గుర్తు చేశారు. ప్రజల్లోకి వెళ్తానని, వారి మద్దతును కూడ గట్టుకుంటానని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తన సుడిగాలి పర్యటన ఉంటుందని, అందుకు తగ్గ పర్యటన వివరాల్ని త్వరలో ప్రకటిస్తానన్నారు.